sports

చాంపియ‌న్స్ ట్రోఫీ విజేత జ‌ట్టుకు ల‌భించే ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా..?

దుబాయ్‌, పాకిస్థాన్ వేదిక‌గా హైబ్రిడ్ మోడ‌ల్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. 2017 త‌రువాత ఇన్నేళ్ల‌కు జ‌రుగుతున్న టోర్న‌మెంట్ కావ‌డంతో ఫ్యాన్స్ అంద‌రిలోనూ ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ త‌మ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త్ చాంపియ‌న్స్ ట్రోఫీలో త‌న మొద‌టి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. రెండో మ్యాచ్‌ను చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్‌తో ఫిబ్ర‌వ‌రి 23న ఆడుతుంది. ఇక చివ‌రి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో మార్చి 2వ తేదీన ఆడుతుంది.

అయితే చాంపియ‌న్స్ ట్రోఫీ నేప‌థ్యంలో ఈ టోర్నీ విజేత‌ల‌కు ఎంత ప్రైజ్ మ‌నీ ఇస్తారు అని చాలా మంది అన్వేషిస్తున్నారు. ఐసీసీ ఈ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హిస్తుంది క‌నుక వారే ఈ ప్రైజ్ మ‌నీ ఇస్తారు. ఈ టోర్నీ విజేత జ‌ట్టుకు 2.24 మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్ మ‌నీ లభిస్తుంది. ర‌న్న‌ర్స్ అప్ జ‌ట్టుకు 1.12 మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్ మ‌నీ ల‌భిస్తుంది. అలాగే సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు వ‌చ్చిన జ‌ట్ల‌కు ఒక్కో దానికి 5.60 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను ప్రైజ్ మ‌నీగా ఇస్తారు. ఇక 2017లో ఇచ్చిన ప్రైజ్ మ‌నీతో పోలిస్తే ఈసారి ప్రైజ్ మ‌నీని ఏకంగా 53 శాతం పెంచారు.

champions trophy 2025 prize money details

ఈ ప్రైజ్ మ‌నీ మ‌న క‌రెన్సీలో అయితే విజేత జ‌ట్టుకు రూ.20 కోట్లు ల‌భిస్తాయి. 2వ స్థానంలో నిలిచిన జ‌ట్టుకు రూ.10 కోట్లు ఇస్తారు. అదే సెమీ ఫైన‌ల్ వ‌చ్చిన జ‌ట్ల‌కు అయితే రూ.5 కోట్ల చొప్పున ఇస్తారు. ఈ టోర్నీలో తొలి సెమీ ఫైనల్ మార్చి 4న జ‌ర‌గ‌నుండ‌గా, మార్చి 5న రెండో సెమీ ఫైన‌ల్‌ను నిర్వ‌హిస్తారు. మార్చి 9న ఫైన‌ల్ ఉంటుంది.

Admin

Recent Posts