Tamarind Flowers : మారిన జీవన విధానం మనల్ని అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు. ఆయుర్వేదం ద్వారా కూడా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఔషధ మొక్కల్లో చింత చెట్టు ఒకటి. ఇది అందరికి తెలిసిందే. చింతపండుతో పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాం. కానీ చింత చెట్టులో ఔషధ గుణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. అలాగే పాత చింతపండును మాత్రమే వంట్లలో ఉపయోగించాలి. కొత్త చింతపండును ఉపయోగించడం వల్ల వాత, కఫ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచిన చింతపండును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.
చింత చెట్టులో ప్రతి భాగం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చింతపండును, చింత చిగురును తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత విటమిన్ సి లభిస్తుంది. చింత చిగురుతో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసుకుని తింటారు. చింత చిగురును తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చింత పువ్వును కూడా మనం ఆహారంగా తీసుకోవచ్చు. చింత పువ్వును సేకరించి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి సమానంగా సైంధవ లవణం, కరివేపాకు పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, యాలకులు, దాల్చిన చెక్క వంటి వాటిని కలిపి కారం పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని అన్నంతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, ఉదర సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. అలాగే ఈ కారం పొడిని తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కాలేయంలోని మలినాలన్నీ తొలగిపోయి కాలేయం శుభ్రపడుతుంది. అలాగే ఈ పువ్వును ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి.
ఈ పొడిని రోజూ తీసుకోవడం వల్ల ఆయుర్వేద మందులు వాడడం వల్ల శరీరంలో కలిగే వేడి తగ్గుతుంది. అలాగే శరీరంలో అధిక వేడితో బాధపడే వారు, వేసవి తాపంతో బాధపడే వారు కూడా ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. అలాగే కీళ్ల నొప్పులను, నడుము నొప్పిని తగ్గించే గుణం కూడా చింత ఆకులకు ఉంది. ముదిరిన చింతాకులను ముద్దగా నూరి ఆముదంలో వేసి వేయించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న చోట పట్టులా వేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అలాగే చింత గింజల పైఉండే నల్లటి పొట్టును తీసేసి లోపల ఉండే తెల్ల పిక్కలను పొడిగా చేయాలి. ఈ పొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే చింతగింజలను నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ గంధాన్ని తేలు కుట్టిన చోట లేపనంగా రాయాలి. ప్రథమ చికిత్సలో భాగంగా ఇలా చేయడం వల్ల విష ప్రభావం కొంత మేర తగ్గుతుంది.
అలాగే చింత ఆకుల రసాన్ని 30 ఎమ్ ఎల్ మోతాదులో మూడు పూటలా పరగడుపున తీసుకోవడం వల్ల పచ్చ కామెర్ల వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. అయితే ఈ చిట్కాను పాటించేటప్పుడు చప్పటి ఆహారాన్ని తీసుకోవాలి. వాంతులు ఎక్కువగా అవుతున్నప్పుడు కొద్దిగా చింతపండును నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వాంతులు తగ్గుతాయి. చింతగింజలను అరగదీయగా వచ్చిన మిశ్రమంలో నిమ్మరసం కలిపి చర్మం పై లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ విధంగా చింత చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.