Hair Fall Remedy : జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్య ఎదుర్కొంటున్నారు. జుట్టు కుదుళ్లు బలహీనంగా మారడం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. తలపై ఉన్న చర్మం పొడిబారడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలడం,బట్టతల, చుండ్రు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటాం. ఇంటి చిట్కాను ఉపయోగించి అలాగే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల చాలా సులభంగా జుట్టురాలడాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేయడానికి మనం ఉపయోగించాల్సిన పదార్థాల్లో కలబంద గుజ్జు ఒకటి. కలబందలో మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కావల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి.
పి హెచ్ లెవల్స్ అదుపులో ఉంచి చర్మం పొడిబారకుండా చేయడంలో కూడా కలబంద మనకు ఉపయోగపడుతుంది. చుండ్రు సమస్యను తగ్గించడంలో, జుట్టుకు తేమను అందించడంలో కూడా కలబంద మనకు తోడ్పడుతుంది. ముందుగా శుభ్రంగా కడిగిన కలబంద గుజ్జును ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ లా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ కలబంద పేస్ట్ లో 2 టీస్పూన్ల ఆముదం నూనెను వేసి కలపాలి. ఆముదం నూనెలో రెసినోలిక్ యాసిడ్లు, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టుకు రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేసి జుట్టు ఎదుగుదలకు సహాయపడతాయి. ఆముదం నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరస్ గుణాలు చుండ్రును తగ్గించడంలో దోహదపడతాయి.
అలాగే చివరగా ఇందులో ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా జుట్టు కుదుళ్ల మొత్తానికి పట్టించాలి. దీనిని గంటన్నర నుండి రెండు గంటల వరకు ఇలాగే ఉంచాలి. తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించడం వల్ల తలో చుండ్రు సమస్య తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కాను పాటిస్తూనే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. వేడి నీటితో తలస్నానాన్ని చేయకూడదు.
గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసిన ఆ తరువాత ఒక మగ్గైనా చల్లటి నీటిని తలపై పోసుకోవాలి. అలాగే ఇటువంటి హెయిర్ ప్యాక్ లను ఉపయోగించినప్పుడు రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. అలాగే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఎ, సి, డి, ఇ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజూ తగినన్ని నీటిని తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగకపోయినా కూడా జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంది. ఈ చిట్కాను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం అనే సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు.