Shahi Egg Dum Pulao : మనకు రెస్టారెంట్ లలో వివిధ రుచుల్లో వివిధ రకాల పులావ్ లు లభిస్తూ ఉంటాయి. మనకు ఎక్కువగా లభించే పులావ్ వెరైటీస్ లో షాహీ ఎగ్ ధమ్ పులావ్ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే పులావ్ ను మనం ఇంట్లో కూడా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే షాహీ ఎగ్ ధమ్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
షాహీ ఎగ్ ధమ్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – 12, పెరుగు – పావు కప్పు, కొత్తిమీర – ఒక చిన్న కట్ట, పుదీనా – గుప్పెడు, పచ్చిమిర్చి – 5, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉడికించిన కోడిగుడ్లు – 4, పసుపు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, దంచిన యాలకులు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – ఒక టీ స్పూన్, లవంగాలు – 5, మిరియాలు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పొడుగ్గి సన్నగా తరిగిన టమాట – 1, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, జీడిపప్పు పలుకులు – పావు కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, ఫ్రెష్ క్రీమ్ – 2 టీ స్పూన్స్, గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు.
షాహీ ఎగ్ ధమ్ పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో జీడిపప్పు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉడికించిన కోడిగుడ్లు, పసుపు, కారం వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. మరో కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. మసాలా దినుసులు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాల పొడి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. ఇలా వేయించిన తరువాత జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి.
జీడిపప్పు పలుకులు వేగిన తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత క్రీమ్ వేసి కలపాలి. తరువాత బాస్మతీ బియ్యం వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై 60 శాతం ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మూత తీసి వేయించిన గుడ్లనుపైన ఉంచాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యిని పైన చల్లుకోవాలి. ఇప్పుడు వీటిపై టిష్యూ పేపర్ ను లేదా అరటి ఆకు లేదా మైదా పిండితో సీల్ చేసుకుని మూతను పెట్టాలి. తరువాత దీనిని మరో 10 నిమిషాల పాటు చిన్న మంటపై దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీయకుండా 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 20 నిమిషాల పాటు ఉంచిన తరువాత కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే షాహీ ధమ్ పులావ్ తయారవుతుంది. దీనిని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఎగ్స్ తో ఇలా దమ్ పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు.