Protein Rich Salad : బరువు తగ్గాలనుకునే వారు రకరకాల డైటింగ్ పద్దతులను పాటిస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు సలాడ్ లను ఎక్కువగా తింటూ ఉంటారు. సలాడ్ లను కొద్దిగా తినగానే కడుపు నిండిని భావన కలగడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు కింద చెప్పిన విధంగా ప్రోటీన్ రిచ్ సలాడ్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ప్రోటీన్ రిచ్ సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ రిచ్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొలకెత్తిన పెసర్లు – ఒక కప్పు, మొలకెత్తిన శనగలు – పావు కప్పు, రాత్రంతా నానబెట్టిన పల్లీలు – పావు కప్పు, తాజా పన్నీర్ క్యూబ్స్ – పావు కప్పు, లేత పాలకూర ఆకు తరుగు – పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, కీరదోస తరుగు – ముప్పావు కప్పు, చిన్నగా తరిగిన టమాట – 1, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఎల్లో క్యాప్సికం తరుగు – ఒక టేబుల్ స్పూన్, రెడ్ క్యాప్సికం తరుగు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు- కొద్దిగా, సలాడ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
ప్రోటీన్ రిచ్ సలాడ్ తయారీ విధానం..
ఈ సలాడ్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రోటీన్ రిచ్ సలాడ్ తయారవుతుంది. ఈ సలాడ్ ను తయారు చేసుకోవడానికి గానూ ముక్కలను చిన్నగా, సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల తినడానికి చాలా చక్కటా ఉంటుంది. నాలుకకు చుట్టుకు పోకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు, శారీరక వ్యాయామం చేసే వారు, ప్రోటీన్ లోపంతో బాధపడే వారు ఈ విధంగా సలాడ్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.