Maha Shivarathri : పూర్వకాలంలో రుషులు, దేవతలు లేదా రాక్షసులు ఎవరైనా సరే పరమ శివుడి కోసమే ఎక్కువగా తపస్సు చేసేవారు. ఎందుకంటే శివుడు భోళాశంకరుడు కదా.. ఆయన అడిగిన వరాలను కాదు లేదు అనకుండా ఇస్తాడు. కనుకనే శివున్ని చాలా మంది పూజిస్తారు. ఆయనకు పెద్దగా ఆడంబరంగా పూజలు గట్రా చేయాల్సిన పనిలేదు. నిష్టతో భక్తి శ్రద్ధలతో శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి ఒక్క పుష్పాన్ని సమర్పిస్తే చాలు.. శివుడు ప్రసన్నుడు అవుతాడు. కోరిన కోరికలను తీరుస్తాడు.
ఇక ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తులు ఉదయం నుంచే పూజలు మొదలు పెడతారు. ఉదయం నుంచే శివాలయాలు అన్నీ భక్తులతో నిండిపోతాయి. శివలింగ దర్శనం కోసం భక్తులు ఆలయాల్లో బారులు తీరుతుంటారు. శివుడికి రుద్రాభిషేకం చేయిస్తారు. అయితే మహాశివరాత్రి రోజు ఇప్పుడు చెప్పబోయే రెండు మంత్రాలను సాయంత్రం పూట పఠించండి. దీంతో అన్ని సమస్యలు పోతాయి, పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది.
మహాశివరాత్రి రోజు సాయంత్రం సమయంలో ధ్యానంలో కూర్చుని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మీకు వీలున్నన్ని సార్లు జపించండి. ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని జపించండి. మనసులోకి ఇతర ఆలోచనలు రానివ్వకండి. దృష్టి, ధ్యాసనంతా పరమశివుడిపైనే నిలపండి. అదే సమయంలో మీకు ఉన్న ఏదైనా సమస్యకు చెందిన కోరికను బలంగా కోరండి. ఏదైనా ఒక కోరికనే కోరండి.
పెళ్లి, వివాహం, సంతానం, దాంపత్య సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం.. ఇలా సమస్య ఏదైనా సరే ఒకే ఒక కోరిక కోరండి. ఆ కోరిక కోరుతూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యాసనంతా పరమశివుడిపైనే నిలపండి. ఇలా కనీసం 1 గంటపాటు అయినా చేయండి. లేదా మీకు వీలైతే ఇంకా ఎక్కువ సమయం పాటు కూడా చేయవచ్చు. ఇలా మహాశివరాత్రి రోజు పైన చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ శివున్ని ధ్యానించడం వల్ల మీరు అనుకున్నవి నెరవేరుతాయి. ఏ సమస్య అయినా సరే తొలగిపోతుంది. ఇక అదే రోజు మహామృత్యంజయ మంత్రాన్ని కూడా పఠించవచ్చు. దీంతో ఆరోగ్య సమస్యలు ఉండవు. మృత్యుభయం పోతుంది.