స్మార్ట్‌ఫోన్… నేటి తరుణంలో వీటి గురించి తెలియని వారుండరు. చాలా తక్కువ ధరలకే లభ్యమవుతుండడంతో పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే అవన్నీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందినవే సుమా! ఎందుకంటే ఆ ఫోన్లే ఇప్పుడు చాలా తక్కువకే వస్తున్నాయి కదా. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, కంపెనీ ఏదైనా వాటిలో లభ్యమయ్యే ఫీచర్లన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. ఆ ఫీచర్లేమిటో, వాటి వల్ల మనం ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇంకా సులభంగా ఎలా వాడగలమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా. అయితే అందులో పదాలను టైప్ చేసి సమాచారాన్ని వెదకడమే కాదు. దాంట్లోనే OK Google అనే ఓ ఫీచర్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి మనకు కావాలనుకున్న సమాచారాన్ని ఇంగ్లిష్‌లో అడిగితే చాలు. వెంటనే నెట్‌లో సెర్చ్ చేసి దానికి తగిన విధంగా మనకు సమాధానాలను ఆ ఫీచర్ తెలియజేస్తుంది. ఉదాహరణకు ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుంది? అనడానికి Do I need an umbrella today? అని కూడా చెప్పవచ్చు. అదే విధంగా ట్రాఫిక్ కోసమైతే How is the traffic now at East Zone? అని అడిగితే చాలు. వెంటనే సమాధానం వచ్చేస్తుంది. ఆండ్రాయిడ్ డివైస్‌కు వచ్చే నోటిఫికేషన్‌లను చూడడానికి ఒకే వేలితో మనం నోటిఫికేషన్ బార్‌ను ఓపెన్ చేస్తాం కదా. అదే సెట్టింగ్స్ కోసమైతే రెండు వేళ్లను ఒకేసారి నోటిఫికేషన్ బార్ నుంచి కిందకి అంటే చాలు. క్విక్ సెట్టింగ్స్ వచ్చేస్తాయి.
కేవలం మీకు కావల్సిన వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను మాత్రమే రిసీవ్ చేసుకునేలా ఇతర కాల్స్‌ను బిజీగా పెట్టేలా చేసే ప్రియారిటీ మోడ్ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైస్‌లలో ఉంది. నోటిఫికేషన్ బార్ నుంచి ఈ ఫీచర్‌ను పొందవచ్చు. LIFX పేరిట ఓ ఎల్ఈడీ బల్బ్ మోడల్ మార్కెట్‌లో లభ్యమవుతోంది. ఇది వైఫై టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇంట్లో దీన్ని పెట్టుకుంటే మీ ఆండ్రాయిడ్ డివైస్‌కు ఉన్న వైఫై ద్వారా ఈ బల్బ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ డివైస్‌ను ఓసారి, కంప్యూటర్‌ను ఓసారి, ట్యాబ్‌ను ఓ సందర్భంలో… ఇలా ఆయా సమయాల్లో అందుబాటులో ఉన్న డివైస్‌లను కొందరు వాడుతున్నారు. ఈ క్రమంలో ఓ డివైస్‌లో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదైనా మంచి సైట్ కనిపిస్తే దాని లింక్‌ను మెయిల్‌కు పంపుకోవడమో నోట్‌పాడ్‌లో రాసుకోవడమో చేస్తారు. మళ్లీ ఆ లింక్ కావాలంటే అదే డివైస్‌ను ఓపెన్ చేయాలి. వేరే డివైస్‌లో ఆ లింక్ రాదు. ఈ సమస్య కోసమే పుష్ బుల్లెట్ అనే యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇది పీసీ, ఆండ్రాయిడ్ ఫోన్, ట్యాబ్లెట్ ఇలా ఏ డివైస్‌లోనైనా పనిచేస్తుంది. యూజర్ ఒక లింక్‌ను ఈ యాప్ ద్వారా షేర్ చేసుకుంటే ఆ లింక్‌ను ఇతర ఏ డివైస్‌లోనైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చెప్పబోయే టిప్ స్టూడెంట్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. అదేమిటంటే విద్యార్థులకు ఏదైనా మ్యాథ్స్ ఈక్వెషన్ రాకపోతే సింపుల్ గా దాన్ని ఫొటో తీసి ఫొటో మ్యాథ్ అనే యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. వెంటనే ఆ యాప్ సదరు ప్రశ్నను సాల్వ్ చేస్తుంది. యూఎస్‌బీ ఓటీజీ ఉన్న ఆండ్రాయిడ్ డివైస్‌లకు ఓటీజీ కేబుల్‌ను కనెక్ట్ చేయడం ద్వారా దానికి యూఎస్‌బీ కీ బోర్డ్, మౌస్, పెన్ డ్రైవ్ వంటివి కనెక్ట్ చేయవచ్చు. రాత్రి పూట ఆండ్రాయిడ్ డివైస్‌లలో టెక్ట్స్‌ను చదివే వారి కోసం నెగెటివ్ కలర్స్ అనే ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని వల్ల డివైస్ స్క్రీన్‌పై అక్షరాలు మరింత క్లియర్‌గా కనిపిస్తాయి. ఈ ఆప్షన్‌ను పొందాలంటే డివైస్‌లోని Settings > Accessibility > Negative Colors ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
Settings > Security > Lock screen message ఆప్షన్‌కు వెళ్తే మనం మనకు ఇష్టం వచ్చిన విధంగా లాక్ స్క్రీన్ మెసేజ్‌ను సెట్ చేసుకోవచ్చు. అయితే ఏవో పేర్లు, నంబర్లు, పదాలను ఆ మెసేజ్‌లా పెట్టుకునే బదులు, మీ ఇంటి అడ్రస్‌ను అందులో ఉంచితే పొరపాటున ఫోన్ పోయినా దాన్ని తీసుకున్న వ్యక్తులు ఆ ఫోన్‌లోని లాక్ స్క్రీన్ మెసేజ్‌ను చూసి తిరిగి ఆ ఫోన్‌ను మీకు పంపించేందుకు వీలుంటుంది. వారు ఫోన్ ఇవ్వకూడదని భావిస్తే తప్ప, మీ ఫోన్ మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ డివైస్‌లో Settings > Security > Device Administrators ఆప్షన్‌కు వెళ్లి ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్‌ను యాక్టివేట్ చేసుకుంటే మీ ఫోన్ పోయినప్పుడు అది పనిచేయకుండా అందులోని డేటాను రిమోట్ కనెక్షన్ ద్వారా ఎరేజ్ చేసేందుకు వీలుంటుంది.
గూగుల్ క్రోమ్‌ను ఆండ్రాయిడ్ డివైస్‌లో వాడుతున్నట్టయితే ఆ బ్రౌజర్‌లో గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అయితే అందులో మీరు చూసే సైట్స్ అన్నీ హిస్టరీలో సేవ్ అవుతాయి. తిరిగి వేరే డివైస్‌లోని క్రోమ్ బ్రౌజర్‌లో అదే విధంగా గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అయితే అంతకు ముందు డివైస్‌లో చూసిన సైట్లన్నీ కనిపిస్తాయి.