కష్టాలు కన్నీళ్లను వేటితో కొలుస్తారో తెలీదుగానీ ఒకవేళ వాటికంటూ ఒక కొలమానం ఉంటే అందరి కంటే ఎక్కువ కష్టాలు కన్నీళ్ళు యం.యస్. నారాయణ జీవితంలో ఉంటాయి. పెద్ద కుటుంబం, ఆర్థిక పరిస్థితి మాత్రం అస్తవ్యస్తం, తల్లీపిల్లా అందరూ పొలం పనులకు వెళ్ళినా ఆ కుటుంబంలో రోజూ ఎవరో ఒకరు పస్తు ఉండాల్సిందే, అలాంటి సమయంలో అందరూ పొలం పనులకు వెళ్తే M.S. మాత్రం బడికి వెళ్ళేవారు, విషయం తెలుసుకున్న తండ్రి బడిలో నుంచి ఈడ్చుకొచ్చి పొలంలో పడేసేవాడు, ఆయనకు కోపం వీడు పని ఎగ్గొట్టడానికి బడికెళ్తున్నాడు అని, ఎందుకంటే యం.యస్ చాలా బక్కగా ఉండేవారు, తండ్రికి తెలియకుండా ఈయన బడికి వెళ్ళడం, అది తెలిసి ఆయన లాక్కొచ్చి పొలంలో పడేయడం, ఆ తండ్రీకొడుకులకు ఒక అలవాటయ్యింది, కానీ మన M.S. మహా మొండోడు…
కేవలం పొలం పని ఎగ్గొట్టడానికి వీడెందుకు ఇలా చేస్తున్నాడనే అనుమానం ఆ తండ్రిది, కానీ యం.యస్ ఆశయం వేరు, తన ఇంట్లో ఎవరూ ఎప్పుడూ పస్తులు ఉండకూడదు, అలా ఉండకూడదంటే చదువే మార్గం, నారప్ప సినిమాలో డైలాగ్ ను దాదాపు నలభై ఏళ్ల క్రితమే తన తండ్రికి చెప్పి చదువుకుంటాను నాన్న అని తన కన్నీళ్ళతో తండ్రి కాళ్ళు కడిగాడు, కనికరించిన ఆ తండ్రి మరుసటిరోజు నుంచి దగ్గరుండి మరీ బడికి తీసుకెళ్ళాడు. కాలేజీ రోజుల్లో M.S. నారాయణని చాలా మంది క్లాస్ మేట్స్ ఎన్నో అవమానాలకు గురి చేసేవారంట, వాటన్నింటినీ పంటి బిగువన భరించింది కూడా తన కుటుంబం కోసం తన చదువు కోసమే. నటుడు, కమెడియన్ కన్నా ముందు ఒక గొప్ప రచయిత, తెలుగు భాష పట్ల గౌరవం, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఆయనను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాయి.
సినిమాల మీద ఆసక్తితో, ఆరాధనా భావంతో ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు, సినిమా కథలు రాసుకుని, ఎంతోమంది దర్శకులను కలిసి తన కథలను వినిపించేవారు. తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు, అలా పనిచేస్తున్న రోజుల్లోనే… ప్రతి శనివారం మద్రాసుకు బయలుదేరి, ఆదివారమంతా సినిమా ప్రయత్నాలు చేసి, అదే రోజు రాత్రి రైలెక్కి, సోమవారం ఉదయం కల్లా స్కూల్లో పాఠాలు చెప్పేవారు, ఎంత ఓపిక ఉండాలి, ఎంత ప్యాషన్ ఉండాలి, ఎంత పిచ్చి ఉండాలి, సినిమా మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా చేస్తాడు. పేదరికంతో పోరాడి, అలసిపోయి ఒక దశలో సినిమాలే వద్దు అనుకున్నాడు, కానీ తనలోని కళా పిపాసి నిద్రపోనివ్వలేదు, మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాడు, ఈసారి కొండను ఢీ కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఇలా దాదాపు ఓ 8 సంవత్సరాల పాటు తిరిగి కష్టపడ్డాడు, ఆ తరువాత పరుచూరి గోపాలకృష్ణ, రవిరాజా పినిశెట్టి వంటి వారి ప్రోత్సాహంతో ఉద్యోగం కూడా వదిలేసి, పూర్తిగా సినిమా రంగంలోనే తన ప్రయాణాన్ని కొనసాగించారు.
సినిమా మీద విపరీతమైన పిచ్చి, వ్యామోహం, ఒక దశలో సినిమానే వ్యసనం, తనమీద తనకు నమ్మకం ఎప్పటికైనా వెండితెరపై తనకంటూ ఓ స్థానం ఉంటుందని, ఆ సంకల్పంతో ఓరోజు పేపర్లో ప్రకటన చూసి చెన్నై బయలుదేరాడు, ఆరు రోజులు మద్రాసులో ఉంటే తను కడుపునిండా తిన్నది రెండు రోజులే. ఐనా సరే పట్టు సడలలేదు, ఆశయం పక్కన పెట్టలేదు, మరింత ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నాల్లో భాగంగా రవిరాజా పినిశెట్టి, పరుచూరి బ్రదర్స్, కె. రాఘవేంద్ర రావు లాంటి దర్శకుల పరిచయాలు తన సినీ జీవితానికి చిన్న పునాది వేశాయి. పరుచూరి గోపాలకృష్ణ M.S. లోని ప్రతిభను గుర్తించి, చాలామందికి రెకమెండ్ చేసేవారు, కళాప్రపూర్ణ అనే అమ్మాయిని ప్రేమించానని మొదట యం యస్ నారాయణ చెప్పింది గోపాలకృష్ణకే, ఆయనే దగ్గరుండి పెళ్ళి చేశారు M.S. నారాయణ – కళాప్రపూర్ణకు.
పేకాట పాపారావు సినిమాకు, మరికొన్ని చిన్న సినిమాలకు కథా సహకారం అందించారు, దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర పనిచేసే రోజుల్లో ఎమ్.ధర్మరాజు ఎమ్.ఏ సినిమాలో చిన్న పాత్ర, ఆ తరువాత పెదరాయుడు సినిమాలో మరో చిన్న పాత్ర చేయడంతో అవి నచ్చి, రుక్మిణీ అనే సినిమాలో పూర్తి స్థాయి కమెడియన్ గా అవకాశం ఇచ్చారు రవిరాజా పినిశెట్టి. ఇక అక్కడినుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకూ దాదాపు 700 సినిమాల్లో నటించారు. దూకుడు సినిమా కు నంది అవార్డు అందుకున్నారు. బ్రహ్మానందం 700 సినిమాలు చేయడానికి 20 యేళ్ళు పట్టింది, కానీ యం యస్ నారాయణ 15 ఏళ్ళకే 700+ సినిమాల్లో నటించారు. ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టి, చదువుకోవడానికి ఓ యుద్ధం చేసి, తన సొంత టాలెంట్ తో ఎదిగి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యం యస్ నారాయణ ఎంతోమందికి ఆదర్శం.