Crime News

రోడ్డు ప్ర‌మాదాల‌కు 5 ముఖ్య కార‌ణాలు ఇవే..!

మ‌న రాష్ట్రంలోనే కాదు, మ‌న దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవ‌లి కాలంలో అనేక రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ మ‌ధ్య కాలంలో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించే దిశ‌గా సంబంధిత అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ద్ర‌తకు సంబంధించిన సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు చెబుతూ వాహ‌నదారుల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ రోడ్డు ప్ర‌మాదాలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు స‌రిక‌దా.. ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అయితే అస‌లు ఎక్క‌డైనా సరే.. రోడ్డు ప్ర‌మాదం జ‌రిగితే.. అందుకు కార‌ణాలు ఏమిటి ? అనే విష‌యాన్ని మ‌నం ఒక్క‌సారి ప‌రిశీలిస్తే…

రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగేందుకు అనేక కార‌ణాలుంటాయి. అయిన‌ప్ప‌టికీ మ‌న‌కు ఈ 5 కార‌ణాలు మాత్రం ఎప్పుడూ ప్ర‌ధానంగా క‌నిపిస్తుంటాయి. అవేమిటంటే…

1. అతివేగం, నిర్ల‌క్ష్యం

ఇటీవ‌లి కాలంలో జ‌రిగిన అనేక రోడ్డు ప్ర‌మాదాల ఘ‌ట‌న‌ల‌కు కార‌ణాల్లో ఒక‌టి అతివేగం అని కూడా తెలిసింది. సాధార‌ణంగా కార్లు, బ‌స్సులు, ఇత‌ర భారీ వాహ‌నాలు త్వ‌ర‌గా గ‌మ్య‌స్థానాల‌కు చేరాల‌నే తొంద‌ర‌లో వేగంగా వెళ్తుంటాయి. డ్రైవ‌ర్లు ప‌రిమితికి మించి వేగంతో వాహ‌నాల‌ను న‌డిపిస్తుంటారు. దీంతో ఒక్కోసారి వాహ‌నాలు గంట‌కు 120 కిలోమీట‌ర్ల నుంచి 140 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంటాయి. ఈ క్ర‌మంలో ర‌హ‌దారిపై ఏదైనా అడ్డుగా వ‌చ్చినా.. లేదా ఆ స‌మ‌యంలో నిద్ర వ‌చ్చినా.. ఆద‌మ‌రిచి ఉన్నా.. క్ష‌ణాల్లో ప్ర‌మాదం జ‌రుగుతుంది. త‌క్కువ వేగంతో ప్రయాణిస్తే ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు కూడా చాలా త‌క్కువ‌గా ఉంటాయి. కానీ అతి వేగంతో వాహ‌నాల‌ను న‌డిపిస్తే ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు పెరుగుతాయి. ఈ క్ర‌మంలోనే డ్రైవ‌ర్లు అతి వేగంతో నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డిపిస్తుండడం వ‌ల్లే చాలా వ‌ర‌కు రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందువ‌ల్ల ర‌హ‌దారుల‌పై వాహ‌నాలు ఎక్కువ వేగంతో వెళ్ల‌కుండా సంబంధిత అధికారులు ప‌ర్య‌వేక్షించాలి. స్పీడ్ గ‌న్స్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వాహ‌నాల వేగంపై నిఘా ఉంచాలి. అతి వేగంతో వెళ్లే వాహ‌న‌దారుల‌పై కఠిన చ‌ర్యలు తీసుకోవాలి. దీంతో కొంత వ‌ర‌కైనా రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గుతాయి.

these are the 5 main reasons for road accidents

2. పాద‌చారుల నిర్ల‌క్ష్యం

కొన్ని సంద‌ర్భాల్లో పాద‌చారులు నిర్ల‌క్ష్యంగా రోడ్డుపై న‌డుస్తుంటారు. రోడ్డు దాటుతుంటారు. అలాంటి స‌మ‌యాల్లో రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతాయి. క‌నుక రోడ్ల‌పై న‌డిచేట‌ప్పుడు ఎవ‌రైనా స‌రే.. ఒక‌టికి రెండు సార్లు వాహ‌నాలు వ‌స్తున్నాయో, రావ‌డం లేదో చూసుకుని మ‌రీ రోడ్డు దాటాలి. అలాగే పాద‌చారుల కోసం వాహ‌నాలు వేగంగా వెళ్లే ప్రాంతాల్లో రోడ్ల‌పై సూచిక‌, హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాలి. ప్ర‌మాదాలు బాగా జ‌రిగే చోట హెచ్చ‌రిక బోర్డుల‌ను విరివిగా ఏర్పాటు చేయాలి. పాదచారులు రోడ్డును దాటేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్తల‌పై సంబంధిత అధికారులు వారికి అవ‌గాహ‌న క‌ల్పించాలి.

3. ప‌రిమితికి మించి ప్ర‌యాణికుల‌ను ఎక్కించ‌డం

ఆటోలు, కార్లు, తుఫాన్ లాంటి వాహనాలలో డ్రైవ‌ర్లు ప‌రిమితికి మించి ప్రయాణికుల‌ను ఎక్కిస్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో డ్రైవ‌ర్‌కే చోటు లేనంత‌గా వాహ‌నాలు కిక్కిరిసి పోతుంటాయి. అయితే ఇలా ప్రయాణికుల‌ను ఎక్కించ‌డం ప్ర‌మాదక‌రం. ఇలాంటి సంద‌ర్భాల్లో రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ప్ర‌యాణికులు కూడా కిక్కిరిసిన వాహ‌నాల్లో ప్ర‌యాణించ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.

4. రోడ్డు నిర్మాణంలో లోపాలు

మ‌న దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న జాతీయ, రాష్ట్ర ప్ర‌ధాన ర‌హ‌దారుల నిర్మాణంలో అనేక లోపాలున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లో క్రాసింగ్‌లు స‌రిగ్గా క‌నిపించ‌క‌పోవ‌డం, సిగ్న‌ల్స్ లేక‌పోవ‌డం, సూచిక బోర్డులు, హెచ్చ‌రిక చిహ్నాలు ఉండ‌క‌పోవ‌డం, ఒక్కో చోట ఇరుకుగా ర‌హ‌దారులు ఉండ‌డం, వంతెన‌ల‌పై రెయిలింగ్‌లు దెబ్బ తిన‌డం, అండ‌ర్‌పాస్‌లు, ఫ్లై ఓవ‌ర్లు అవ‌స‌రం ఉన్న చోట లేక‌పోవ‌డం, రోడ్లు దెబ్బ తిని గుంత‌లు ప‌డ‌డం, డివైడ‌ర్లు లేక‌పోవ‌డం.. వంటి అనేక నిర్మాణ లోప‌ల వ‌ల్ల కూడా రోడ్డు ప్ర‌మాదాలు అధికంగా జ‌రుగుతున్నాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. క‌నుక ఈ దిశ‌గా కూడా సంబంధిత అధికారులు, ప్ర‌భుత్వాలు ఆలోచించి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాలి. రోడ్ల‌ నిర్మాణాల్లో లోపాలు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. రోడ్డు ప్రమాదాల‌ను కొంత వ‌రకైనా నివారించ‌వ‌చ్చు.

5. మ‌ద్యం సేవించ‌డం, నిద్ర లేకుండా సుదీర్ఘంగా వాహ‌నాల‌ను న‌డిపించ‌డం…

మ‌న దేశంలో రోడ్ల‌పై జ‌రుగుతున్న అనేక ప్ర‌మాదాల్లో కొన్ని… డ్రైవ‌ర్లు మ‌ద్యం సేవించి వాహ‌నాన్ని న‌డిపించ‌డం వ‌ల్ల కూడా జ‌రుగుతున్నాయి. పీక‌లదాకా మద్యం సేవించి వాహ‌న‌దారులు వాహ‌నాల‌ను న‌డిపిస్తూ ఇత‌రుల ప్రాణాల‌ను బ‌లిగొంటున్నారు. క‌నుక ఈ దిశ‌గా కూడా అధికారులు, ప్ర‌భుత్వాలు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాలి. అలాగే కొన్ని సంద‌ర్భాల్లో లారీలు, బ‌స్సులు, ట్రావెల్ కార్ల డ్రైవ‌ర్లు నిద్ర లేకుండా అదే ప‌నిగా సుదీర్ఘంగా కొన్ని గంట‌ల పాటు వాహ‌నాల‌ను న‌డుపుతుంటారు. దీంతో నిద్ర ఆవ‌హించి ఆ మ‌త్తులో ప్రమాదాలు జ‌రుగుతున్నాయి. క‌నుక య‌జ‌మానులు త‌మ డ్రైవ‌ర్ల‌కు నిర్దిష్ట‌మైనన్ని గంట‌ల‌పాటు మాత్ర‌మే వాహ‌నాన్ని న‌డిపేలా ప‌ని అప్ప‌జెప్పాలి. అదే క్ర‌మంలో వాహ‌న‌దారులు కూడా నిద్ర వ‌స్తున్నా.. బ‌ల‌వంతంగా ఆపుకుని వాహ‌నాన్ని న‌డిపించ‌కూడ‌దు. కొంత సేపు విశ్రాంతి తీసుకుని అవ‌స‌రం అయితే తిరిగి వాహ‌నాన్ని న‌డ‌ప‌డం కొన‌సాగించ‌వ‌చ్చు..!

Admin

Recent Posts