Seemantham : మహిళలు గర్భం ధరించినప్పుడు భర్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యానికి సహకరిస్తూ ఉంటారు. అయితే గర్భవతి అయిన మహిళలకు ఏడో నెలలో సీమంతం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే కుటుంబ ఆచారాలను బట్టి కొందరు 5వ నెలలో.. మరికొందరు 9వ నెలలో కూడా చేస్తూ ఉంటారు.
వారి వారి పరిస్థితులను బట్టి ఈ సీమంతం చేస్తూ ఉంటారు. అయితే అసలు గర్భిణీ అయిన స్త్రీలకు సీమంతాలు ఎందుకు చేయాలి..? దీని వెనుక అసలు కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. గత జన్మలో పుణ్యాలు చేయడం వల్లే ఈ జన్మలో మానవ జన్మ లభిస్తుంది. అయితే లభించిన మానవ జన్మకు షోడశ సంస్కారాలను చేయాలని అంటుంటారు.
వీటిలో కొన్నిటిని జనన పూర్వ సంస్కారాలను, మరి కొన్నిటిని జననాంతర సంస్కారాలను అంటుంటారు. గర్భంలో ఉండగానే బిడ్డ బయటకు రాకముందే చేసే సంస్కారాన్ని సీమంతం అంటారు. ఇది మూడో సంస్కారం. మొదటి రెండు సంస్కారాలను గర్భాదానం, పుంసవన అని పేర్కొంటారు. తల్లి సౌభాగ్యంగా ఉండాలని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా పుట్టాలని కోరుకుంటూ ఈ సీమంతాన్ని వేడుకగా జరిపిస్తారు. అలాగే గర్భిణీ మానసికంగా శారీరకంగా, ఆహ్లాదంగా ఉండటం కోసం కూడా ఈ వేడుకను జరిపిస్తారు. ఇవీ.. సీమంతం జరిపేందుకు వెనుక ఉన్న కారణాలు.