Unthakal Panduranga Swamy Temple : పుణ్యక్షేత్రాలకు వెళ్లి, అక్కడ ఉండే స్వామి వారితో మన యొక్క కోరికలను చెప్తే అవి తీరిపోతాయని, ఆ కష్టాల నుండి బయట పడవచ్చని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మద్యానికి బానిసలైన వారు ఈ ఆలయానికి వెళితే, మద్యం మానేస్తారట. ఈ ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? పాండురంగడు మద్యానికి బానిస అయితే దాని నుండి ఆయనని బయట పడేవారట. మరి ఇక ఈ ఆలయం గురించి ఈ ఆలయ ప్రత్యేకత గురించి ఇప్పుడే మనం చూసేద్దాం. మందు మాన్పించడమే ఈ స్వామివారి ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అనంతపురం జిల్లాలో, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో ఉంతకల్లు గ్రామంలో పాండురంగ స్వామి ఉన్నారు. మద్యాన్ని మాన్పించే దేవుడు ఈయన. ఏకాదశి తిధి వచ్చిందంటే ఇక్కడ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎన్నో చోట్ల నుండి పాండురంగ ఆలయానికి వస్తూ ఉంటారు భక్తులు. మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా దీక్షలు, ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడ కనబడతారు. ఉంతకల్లు.. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. ఈ ఊరంతా కూడా పాండురంగ స్వామి భక్తులే.
2005లో రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయాన్ని కట్టడం ప్రారంభించారు. దీని నిర్వహణ అంతా కూడా గ్రామస్తులే చూసుకుంటారు. మద్యానికి బానిసలయ్యి, చాలా మంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మద్యం అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటు నుండి బయట పడడానికి, పాండురంగ స్వామి మాలధారణ చేస్తారు. ఆ వ్యసనము నుండి బయటపడతారు. ఈ స్వామి మీద ఉన్న భక్తి, భయం వలన మద్యం తాగే వారిలో మార్పు కనపడింది. మళ్లీ మద్యం జోలికి వెళ్లలేదట. అప్పటినుండి కూడా ఇక్కడికి చాలామంది మద్యం మానేయడానికి వస్తూ ఉంటారు. సాధారణంగా ఏ ఆలయానికైనా వెళ్తే భగవంతుడిని దర్శనం చేసుకుని, ఇంటికి వెళ్లిపోతారు.
మాల ధారణ మాత్రం నెలలో రెండు రోజులే. ఏకాదశి రోజున మాత్రం భారీగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం గ్రామస్తులు శక్తి కొలది మర్యాదలు చేస్తారు. ఏకాదశి నాడు మూడు వేల మందికి పైగా భక్తులు వస్తారు. మాల వేసుకున్న వారంతా కూడా తెల్లవారుజామున స్నానం చేసి, టోకెన్లు తీసుకుంటారు. భక్తులందరికీ గ్రామస్తులే ఫ్రీగా భోజనం, వసతి కల్పిస్తారు. మాలధారణ చేసిన వారంతా కూడా మూడు ఏకాదశి రాత్రులు ఉంతకల్లులో నిద్ర చేయాలి. మాల వేసుకున్నాక ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. మూడు ఏకాదశిలు నిద్ర చేశాక కావాలంటే తీసేయొచ్చు. ఇలా చేస్తే మద్యం మానేస్తారు.