Allu Ramalingaiah : లెజెండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా 1000 చిత్రాలకు పైగా నటించి అలరించిన నట దిగ్గజం. అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. బాల్యం నుంచి తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచసాగారు. రామలింగయ్య చదువుకొనే రోజుల్లోనే వేషాలు కట్టారు. వేదికలపై ఉపన్యాసాలూ ఇచ్చారు. యవ్వనంలో కులమత విభేదాలను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక ఆయన కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు.. రివార్డులున్నాయి.
రేలంగి తరువాత పద్మశ్రీ పురస్కారం అందుకున్న హాస్యనటుడిగా చరిత్రలో నిలిచారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు సైతం అందుకున్నారు. తేజ దర్శకత్వంలో రూపొందిన జై చిత్రంలో అల్లు రామలింగయ్య చివరిసారి తెరపై కనిపించారు. 2004 జూలై 31న అల్లు రామలింగయ్య తుదిశ్వాస విడిచారు. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో అరవింద్ ఒకరు. ఇక రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా వారిని ప్రేమగా స్మరించుకున్నాడు. నా మామగారిలా కాకుండా గొప్ప నటుడిగా, ఉద్వేగపరమైన వైద్యుడిగా నిబద్దతతో కూడిన స్వాతంత్య్ర సమర యోధుడిగా, ప్రగాఢ తత్వవేత్తగా మార్గదర్శిగా గురువుగా కరుణామయుడిగా మీరిప్పుడు మా ఆలోచనల్లో ఉంటారంటూ మెచ్చుకున్నాడు. అల్లు రామలింగయ్య 1980లో అతని కుమార్తె సురేఖను చిరంజీవితో వివాహం జరిపించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సుష్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్ చరణ్ ఉన్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట చిరంజీవి, సురేఖ పెళ్లి ఫొటో వైరలవుతోంది. అందులో అల్లు రామలింగయ్య కూడా ఉన్నారు.