Balakrishna : నందమూరి నట వారసుడిగా అరంగేట్రం చేసి నాలుగు దశాబ్దాలుగా తెలుగు తెరపై తన ప్రత్యేకతను చాటి చెప్పారు నటసింహ బాలకృష్ణ. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాలయ్య బాబు చిత్రం రిలీజ్ అయిందంటే చాలు ప్రేక్షకులకు ఆ సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్లకు క్యూ కట్టేస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలందరిలో బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం బాలకృష్ణ ఇటు సినిమాలతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. 1999లో బాలకృష్ణ నటించిన సుల్తాన్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో ఒక బాలకృష్ణ దేశభక్తి కలవాడు గానూ, మరొక బాలకృష్ణ దేశద్రోహిగా అంటే విలన్ గా నటించి అందరినీ ఆకట్టుకుని మంచి మార్కులు దక్కించుకున్నారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా థియేటర్ల వద్ద యావరేజ్ కలెక్షన్లను రాబట్టింది.
ఇక సుల్తాన్ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూపర్ స్టార్ కృష్ణ, ఇంటెలిజెంట్ సిబిఐ ఆఫీసర్ గా రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఇద్దరూ థియేటర్లలో చూసే ప్రేక్షకులతో విజిల్స్ పడేవిధంగా నటించారు. ఇలా ముగ్గురు అగ్రస్థాయి కథానాయకులతో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాలయ్యను ట్రైలర్ లో పలు పాత్రల్లో చూసి ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ ఊహించుకున్నారు. అందరి ఊహలను తారుమారు చేస్తూ ఈ సినిమాకి ఆశించిన మేరకు ఫలితం దక్కలేదు.
సుల్తాన్ చిత్రం కోసం దర్శకుడు శరత్, రచయితలు పరుచూరి బ్రదర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇందులో ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవరి ఇమేజ్‌కి తగ్గకుండా హీరోల పాత్రలను క్రియేట్ చేశారు. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే ఒకరు పవర్ పుల్ సీబీఐ ఆఫీసర్‌గా, ఒకరు పోలీస్ ఆఫీసర్ గా ఎవరైతే బాగుంటారని చర్చలు జరిగాయట. అప్పుడు పరుచూరి బ్రదర్స్‌ని సీబీఐ ఆఫీసర్ గా కృష్ణంరాజు, పోలీస్ ఆఫీసర్‌గా కృష్ణ తీసుకుంటే బాగుంటుందని బాలయ్య బాబు సూచించారట.
ఈ సినిమా షూటింగ్‌ని మొదటిగా కృష్ణ, కృష్ణంరాజులకు సంబంధించిన పార్ట్‌ను చేద్దామని బాలకృష్ణ అనడంతో దర్శక నిర్మాతలు అండమాన్ దీవుల్లో షూటింగ్ పనులను ప్రారంభించారట. సినిమా షూటింగ్ అండమాన్ దీవుల్లో ఉండడంతో సరదాగా మన ఫ్యామిలీస్ తో ట్రిప్ వేసినట్టు ఉంటుందని భావించి కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వారి వారి కుటుంబాలతో సహా వెంట బెట్టుకొని అందరూ అండమాన్ వెళ్లారట. అక్కడ వాతావరణం, లొకేషన్లు బాగున్నప్పటికీ ఉండడానికి మాత్రం రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ తప్ప వేరే ప్రత్యేకత లేదంట. అండమాన్ దీవులలో తినడానికి తిండికూడా దొరికేది కాదట. ఇక చేసేదేమీ లేక అందరూ అక్కడే అడ్జస్ట్ అయ్యారు. అక్కడికి వెళ్లిన మొదటి రోజు అయితే అక్కడ తినడానికి కూడా ఏమీ దొరకకపోవడంతో బిస్కట్లు, చిన్న చిన్న చిరుతిండ్లతో కాలం గడిపేశారట.
ఆ తరువాత రోజు బయట నుంచి బియ్యం, కూరగాయలు తెప్పించారట. ఉన్నటువంటి కొద్దిపాటి సదుపాయాలతోనే విజయ నిర్మల అద్భుతంగా వంట చేసి పెడితే అందరూ తృప్తిగా కడుపునిండా తిన్నారట. బాలయ్య ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే మనిషి కాబట్టి షూటింగ్ స్పాట్ దగ్గర్లోనే సముద్రంలోని చేపలని వేటాడి మరీ పట్టుకొచ్చి విజయనిర్మలకి ఇచ్చేవారు. ఆమె వాటితో అద్భుతంగా చేపల పులుసు పెట్టేది. ఆ చేపల పులుసు అదిరిపోవడంతో లొకేషన్‌లోకి కూడా పట్టుకెళ్లారట బాలయ్య బృందం. సినిమా టీం అంతా విజయనిర్మల వంటని ఔరా అంటూ లొట్టలువేసుకుంటూ తిన్నారట. దీంతో ఇండస్ట్రీలో విజయనిర్మల చేపల పులుసుకి మంచి పేరు వచ్చింది. ఇలా ముగ్గురు స్టార్స్ అండమాన్ లో కుటుంబంతో ఎంతో సరదాగా గడిపారు.