నాకు గుర్తున్నంత వరకు “విక్రమార్కుడు” సినిమా అస్సలు ఆడలేదు.. కానీ హిట్ అని చెప్పుకోవటం ఎంతవరకు సమంజసం అంటారు? విక్రమార్కుడు సినిమాని రాజమౌళి ఇతర సినిమాలతో పోల్చితే అలానే అనిపిస్తుందేమో గానీ, నిజానికి సినిమా బాగానే ఆడింది. గొప్ప సినిమా కాకపోవచ్చు, బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, కానీ కలెక్షన్ల పరంగా ప్రతికూల ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. విక్రమార్కుడు సినిమాని హిందీలో పునర్మిస్తున్నప్పుడు రాజమౌళిని ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘అంతగా హిట్ అవని ఈ సినిమాని హిందీలో రీమేక్ ఎందుకు చేస్తున్నారో తెలియదని’ అన్నాడు. ఆ వీడియో గురించి వెతికాను కానీ దొరకలేదు.
థియేట్రికల్ రన్ లో గొప్పగా అనిపించని సినిమా, పలు భాషల్లో రీమేక్ చేయబడి, ఆ నాసిరకం సినిమాల ముందు అపురూపమైన ఆణిముత్యంగా మారింది. ఆయా సినిమాల్లో హీరో నటన ముందు, రవితేజ గొప్ప నటుడిలా కనబడ్డాడు. అసలు హిట్ అవని సినిమాలను కూడా గొప్ప హిట్లుగా చూపి, రెండు వారాలు కూడా నడవని సినిమాని 100 రోజులు నడిచేలా చేసిన రోజులున్నాయి. అలాంటి సినిమాల మధ్య, కమర్షియల్ గా హిట్ అయిన సినిమాని హిట్ అని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. తప్పే కాదు. అప్పటి ఒక ప్రేక్షకుడిగా ఆ సినిమా నాకు అంతగా నచ్చకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇది నా స్వీయానుభవం, స్వాభిప్రాయమే తప్ప, రివ్యూ కాదు, ఒకరి విలువని తగ్గించే ప్రయత్నమూ కాదు.
షోలే సినిమా హిట్ అయ్యాక, అలాంటి బాక్ డ్రాప్ తో ఎన్నో సినిమాలు ఎన్నో భాషల్లో వచ్చాయి. జన జీవన స్రవంతికి దూరంగా ఓ విలన్. ఇదెంత ఔట్ డేట్ అయిందీ అంటే 1980వ దశకంలోనే షోలే కి పేరడి సినిమా కూడా వచ్చింది. దాని పేరు రామ్ పూర్ కే షోలే. గబ్బర్ సింగ్ పాత్ర ప్రభావం దేశమంతా పడింది. సినిమా చూస్తున్నప్పుడు విక్రమార్కుడులోని విలన్ ని గబ్బర్ తో పోల్చకుండా ఉండలేకపోయాను. అప్పటికీ ఆ పాత్రని అజయ్ బాగానే చేసినా, పాత్రలోనే దమ్ము లేదనిపించింది. ఒక పవర్ఫుల్ ఎమ్యెల్యేకి తమ్ముడు, డాకూ మంగళ్ సింగ్ లా గోనెపట్టాలు కప్పుకుని కొండల్లో గుహల్లో ఎందుకు ఉంటున్నాడో అర్ధం కాలేదు.
చిత్రంగా, అజయ్ ఒక ఇంటర్వ్యూలో ఆ పాత్ర తన కెరీర్ బెస్ట్ గా చెప్పుకున్నాడు. ఇక అనుష్కకు నటన రాదు అని నాకో బలమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని మరోసారి రుజువు చేస్తున్నట్టుగానే ఆమె కనబడింది. చిత్రంగా, ఈ సినిమానే ఆమెకు బ్రేక్ త్రూ అయింది. సినిమా అనే ప్రొడక్ట్ అమ్ముడుపోవాలంటే అశ్లీలం, అసభ్యత తప్పవనే భావనకు లోబడినట్టుగానే ఈ సినిమా కనిపిస్తుంది. అత్యాచారాలు, అకృత్యాలు తప్ప మరేమీ చేయని విలన్లు కనిపిస్తారు. అందులోనూ కాసింత పరాకాష్టలో. కుటుంబంతో పాటు చూడలేని సన్నివేశాలు, ద్వంద్వార్ధపు మాటలు, పాటలు ఉన్నాయి. చిత్రంగా, మాస్ ప్రేక్షకులకు బాగానే నచ్చింది.
అంటే, నాకు ఆ సినిమా పట్ల ఉన్న దృష్టికోణం నాకు మాత్రమే అన్వయిస్తుంది. మిగతావారి దృష్టికోణం వేరు, ఆ సినిమా – వారి జీవితాలపై చూపిన ప్రభావం వేరు అని స్పష్టంగా తెలుస్తోంది కదా. గబ్బర్ సింగ్ లాంటి పాత్రకు నేను కనెక్ట్ అవలేకపోవడం ఒక కారణం అయితే, రెండవ కారణం – సినిమాలో ఎన్నో సన్నివేశాలు అంతకుముందు ఎప్పుడో చూసిన సినిమాలలోనివి కావడం. రవితేజ కాబట్టి ఆ సినిమా అంత మాత్రమైన ఆడింది. బహుశా రాజమౌళి సినిమాల్లో హీరో వల్ల మాత్రమే ఆడిన సినిమా ఇదొక్కటే అనుకుంటాను. ఈ మాట పలుసార్లు రాజమౌళి సైతం ఒప్పుకున్నాడు.
— షఫీ షేక్