వినోదం

క‌ష్టాల‌ను దిగ‌మింగి ప్ర‌పంచాన్ని నవ్వించిన గొప్ప హాస్య న‌టుడు చార్లీ చాప్లిన్‌..!

బ్ర‌ష్ మాదిరిగా ఉండే చిన్న మీసం.. బిగుతైన చిరిగిన కోటు.. వ‌దులు ప్యాంటు… పెద్ద సైజు బూట్లు.. చేతిలో వంకీ కర్ర‌… వంక‌ర టింక‌ర న‌డ‌క‌… ఇవ‌న్నీ విన‌గానే ఇప్ప‌టికే మేం చెప్ప‌బోతున్న వ్యక్తి ఎవ‌రో మీకు గుర్తుకు వ‌చ్చే ఉంటుంది క‌దా. అవును, ఆయ‌నే.. చార్లీ చాప్లిన్‌. ఈ పేరు వింటేనే ఆయ‌న చేసిన హాస్య సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. ఎన్నో సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ చాప్లిన్ సినిమాల‌ను ఆస‌క్తిగా చూసేవారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న గురించిన ప‌లు విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16వ తేదీన జ‌న్మించారు. ఈయ‌న‌ది లండ‌న్. చిన్న‌త‌నంలో చాప్లిన్ తిన‌డానికే తిండి దొర‌క్క ఇబ్బందులు ప‌డ్డారు. త‌ల్లిదండ్రులిరువురు వృత్తిరీత్యా నటులు. వారి ప్రదర్శనలు వాడెవిల్ అనే తరహాకి చెందినవి. అంటే ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్‍లో మ్యూజిక్ హాల్స్‌గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడెవిల్ ప్రదర్శనలు జరిగేవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శన లిచ్చి డబ్బు గడించేవారు. కానీ అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకి ఆమెకి మతి చలించి, ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. త‌రువాత నుంచి చాప్లిన్‌కు మ‌రిన్ని క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

do you know these interesting facts about charlie chaplin

చాప్లిన్‌కు తిన‌డానికి తిండి దొరక్క‌పోతే ప‌రిచ‌య‌స్తులు, బంధువులు, స్నేహితుల ఇండ్ల‌కు స‌రిగ్గా భోజ‌నాల టైముకు వెళ్లేవాడు. అలా అయినా భోజ‌నం దొరుకుతుంద‌ని భావించేవాడు. భోజ‌నాల టైముకు ఇంటికి వ‌చ్చిన వారికి క‌చ్చితంగా భోజ‌నం పెడ‌తారు క‌దా. అలా చాప్లిన్‌కు కూడా భోజనం పెట్టేవారు. అయితే త‌ల్లిదండ్రులిద్ద‌రూ మంచి న‌టులు కావ‌డంతో చాప్లిన్‌కు న‌ట‌న వార‌స‌త్వంగా వ‌చ్చింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచాడు. అయిదవ ఏట మొదటిసారిగా తన తల్లికి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడాడు. క్రమంగా నట వృత్తిలో ప్రవేశించాడు. కానీ వేషాలు వరసగా దొరికేవి కావు. పది పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాలా దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి పొట్టపోసుకునేవాడు. మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవాడు. కానీ క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి.

ఫ్ర‌మ్ ర్యాగ్స్ టు రిచెస్ నాట‌కంలో ఆయ‌న న‌టించారు. త‌రువాత షెర్లాక్ హోమ్స్ నాట‌కంలో బిల్లీ అనే ఆఫీస్ బాయ్ వేషం వేసి న‌టుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే 1910-1913 మధ్యకాలంలో అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత. అప్పటికే అతడుఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‍ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు. అలా అలా క్ర‌మంగా చాప్లిన్ సుప్ర‌సిద్ధ హాస్య న‌టుడిగా గుర్తింపు పొందాడు.

టైమ్ మ్యాగజీన్ ముఖచిత్రంపై కనిపించిన తొలి నటుడుగా చార్లీ చాప్లిన్ పేరు గాంచాడు. చార్లీ తన జీవితంలో మొత్తం నలుగురు అమ్మాయిలను వివాహమాడాడు. ఉక్రెయిన్‌కు చెందిన ఖగోళ పరిశోధకురాలు ఒకరు తాను కనుగొన్న గ్రహశకలానికి చాప్లిన్3623 అని పేరు పెట్టారు. చార్లీ నటించిన తొలి సినిమా ‘మేకింగ్ ఏ లవ్’ ఆయనకే నచ్చలేదట. ఇక చాప్లిన్ కేవలం హాస్య నటుడే కాదు మంచి రచయిత, దర్శకుడు కూడా. టాకీ సినిమాలు వచ్చాక కూడా చాప్లిన్ మూకీలే తీశారు. చాప్లిన్ హాలీవుడ్‌ను వీడిన తరువాత స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నివసించారు. 1977 డిసెంబ‌ర్ 25వ తేదీన 88 ఏళ్ల వ‌య‌స్సులో చాప్లిన్ మృతి చెందారు. ఆయ‌న మృతి చెందిన జెనీవాలోనే ఆయన జ్ఞాపకార్థం అక్కడ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇక చాప్లిన్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో స్కాట్లాండ్‌లోని నేర్న్ ఒకటి. అక్కడికి ప్రతి సంవత్సరం వెళ్లేవారు. అక్క‌డికి వెళ్లి వ‌స్తే ఎంతో ప్ర‌శాంతంగా అనిపిస్తుంద‌ని చాప్లిన్ త‌న స్నేహితుల‌కు చెప్పేవాడ‌ట‌. ఏది ఏమైనా చార్లీ చాప్లిన్ లాంటి హాస్య న‌టుడు మాత్రం మ‌రొక‌రు ఉండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో..!

Admin

Recent Posts