ఆధ్యాత్మికం

స్త్రీ రూపంలో విగ్ర‌హం ఉన్న హ‌నుమంతుడి ఆల‌యం ఎక్క‌డో ఉందో దాని విశిష్ట‌త ఏమిటో తెలుసా..?

ఆంజ‌నేయ స్వామి ఎంత ప‌వ‌ర్‌ఫుల్ దేవుడో భ‌క్తుల‌కు తెలిసిందే. ఆయ‌న్ను అమిత‌మైన బ‌లానికి, శ‌క్తికి, వీర‌త్వానికి ప్ర‌తీక‌గా భావించి అంద‌రూ పూజిస్తారు. దుష్ట‌శ‌క్తులను అణ‌చివేసే దైవంగా భ‌క్తుల‌కు ఎల్లప్పుడూ అండ‌గా ఉంటాడు. ఇక ఈయ‌న బ్ర‌హ్మచారి అనే విష‌యం కూడా అంద‌రికీ తెలుసు. అయితే ఆంజ‌నేయ స్వామి పురుష రూపంలోనే మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాడు. కానీ ఆయ‌న‌కు చెందిన స్త్రీ రూప విగ్ర‌హం కూడా ఉంది తెలుసా..? అవును, షాక్ తిన్నా ఈ విష‌యం నిజ‌మే. ప్ర‌పంచంలో కేవ‌లం ఒకే ఒక్క చోట హ‌నుమంతుని స్త్రీ రూప ప్ర‌తిమ ఉంది. దానికి ఆల‌యం క‌ట్టించగా ఎప్ప‌టి నుంచో అందులో హ‌నుమంతుడు స్త్రీ రూపంలో పూజ‌లందుకుంటున్నాడు తెలుసా..! ఇంత‌కీ ఆ ఆల‌యం ఎక్క‌డ ఉందంటే…

ఛత్తీస్ ఘడ్ లోని రతన్ పూర్ శివారులో హ‌నుమాన్ ఆల‌యం ఉంది. అయితే ఈ ఆల‌యంలో హ‌నుమంతుని విగ్ర‌హం స్త్రీ రూపంలో ఉంటుంది. దానికి ఒక ముక్కు పుడ‌క కూడా ఉంటుంది. ఇక ఈ ఆల‌యం స్థల పురాణం ఏమిటంటే… ఇక్కడ పూర్వ‌ కాలంలో దేవరాజ్ అనే రాజు ఉండేవాడు. అతను హనుమంతుడి భక్తుడు. అయితే ఓసారి ఆ రాజు కుష్టు రోగం బారిన పడ‌తాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అదే రోజు రాత్రి ఆ రాజు కలలో హనుమంతుడు క‌నిపిస్తాడు. తనకు మందిరం నిర్మించాలని హ‌నుమ రాజుకు చెబుతాడు. దీంతో రాజు తన ఆత్మ‌హ‌త్య ఆలోచనను విరమించుకుని హనుమంతుడికి దేవాలయం నిర్మించేందుకు పూనుకుంటాడు.

here you can find lord hanuman in woman form

అయితే మరుసటి రోజు రాత్రి కలలో మరోసారి హనుమంతుడు రాజుకు కలలో కనిపించి అక్కడికి దగ్గర్లో ఉన్న మహామాయ అనే కొలనులో తన విగ్రహం ఉందని దానిని తీసి ప్రతిష్టించాలని రాజును ఆదేశిస్తాడు. దీంతో రాజు ఆ సరస్సు వద్దకు వెళ్లి సేవకులతో విగ్రహాన్ని వెలికి తీయిస్తాడు. అయితే ఆ విగ్రహానికి ముక్కుపుడక ఉండటమే కాకుండా చూడటానికి స్త్రీ మూర్తి వలే ఉంటుంది. అయినా ఆ రాజు ఏ మాత్రం సందేహించ‌క స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి విగ్ర‌హాన్ని ఆయ‌న‌ ఆదేశానుసారం తీసుకెళ్లి దేవాలయంలో ప్రతిష్టిస్తాడు.

ర‌త‌న్ పూర్ ఆల‌యంలో హనుమంతుడు దక్షిణ ముఖంగా ఉంటాడు. ఆయన కుడి వైపు శ్రీ రాముడు, ఎడమ వైపు లక్ష్మణుడు ఉంటాడు. హనుమంతుడి కాలి కింద ఇద్దరు రాక్షసులు ఉంటారు. ఇక ఈ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత రాజు కుష్టు రోగం పూర్తిగా మానిపోయింద‌ట‌. అంతే కాకుండా తనను దర్శించుకున్న వారికి చర్మరోగాలు పూర్తిగా నయమవుతాయని కూడా హనుమంతుడు రాజుకు తెలిపాడ‌ట‌. దీంతో భ‌క్తులు ఇక్క‌డికి వ‌చ్చి స్త్రీ రూపంలో ఉన్న హ‌నుమ విగ్ర‌హాన్ని ద‌ర్శించుకుంటారు. స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. వివాహం త్వరగా జరగాలని, సంతానం కలగాలనే కోరికతో ఎక్కువ మంది భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. ఇక ఈ దేవాలయానికి దగ్గర్లోనే కాలభైరవ మందిరం కూడా ఉంది. అందులో కాలభైరవ విగ్రహం 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. అదేవిధంగా అతి పురాతన లక్ష్మీ దేవి మందిరం కూడా ఈ ఆల‌యానికి చాలా ద‌గ్గ‌ర్లో ఉంది. అందులో కొలువై ఉన్న లక్ష్మీదేవిని కూడా భ‌క్తులు ద‌ర్శించుకుని అమ్మ‌వారి ఆశీస్సులు పొందుతారు.

Admin

Recent Posts