Arundhati Movie : కోడి రామకృష్ణ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన అరుంధతి మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. దర్శకుడు ఆ సినిమాతో ప్రేక్షకులను బాగానే భయపెట్టారు. అయితే తెలుగు సినిమా చరిత్రలో అరుంధతి ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. అందులో అనుష్క శెట్టి రెండు పాత్రల్లో అద్భుతంగా నటించింది. ఈ క్రమంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత పెరిగింది కూడా ఈ సినిమాతోనే అని చెప్పవచ్చు. ఇక అప్పటి వరకు సినిమాల్లో అందాలను ఆరబోసిన అనుష్క ఈ మూవీలో సంప్రదాయ బద్దంగా కనిపించి అలరించింది.
ఇక అనుష్క శెట్టి అరుంధతి చిత్రంలో ఏకంగా తన నట విశ్వరూపం చూపించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా అనుష్క జీవితాన్నే మార్చేసింది. అప్పటి నుంచి అరుంధతి అంటే అనుష్క, అనుష్క అంటే అరుంధతి అని ప్రేక్షకుల మనసులో బలంగా ముద్ర పడింది. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ పై శ్యామ్ ప్రసాద్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అగ్ర దర్శకుడు అయిన కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అనుష్క మెయిన్ లీడ్‌గా నటించిన ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.
వాస్తవానికి ఈ సినిమా ఛాన్స్ తొలుత అనుష్కకు రాలేదట. మళయాళం హీరోయిన్ మమతా మోహన్‌దాస్‌ను అరుంధతి సినిమా కోసం సంప్రదించారట దర్శక నిర్మాతలు. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మమతా మోహన్ దాస్‌కు ఎలాంటి కథలు ఎంచుకోవాలనేది పెద్దగా తెలియక అప్పటికే ఇతర ప్రాజెక్టులను చేస్తుండటంతో అరుంధతిని వదులు కోవాల్సి వచ్చిందని.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మమతామోహన్‌దాస్ చెప్పుకొచ్చింది. అరుంధతి ఆఫర్ వచ్చిన రెండు నెలలకే తనకు క్యాన్సర్ ఉన్నట్టు తేలడంతో సినిమా చేయడం కంటే బతికుంటే చాలు అనే భావనతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు కూడా పేర్కొంది.
ఆ తరువాత ఆ కథ అనుష్క వద్దకు రావడం.. కథ నచ్చి ఆమె ఓకే చెప్పడం అన్నీ చకచకా సాగిపోయాయి. ఇక ఈ చిత్రం విడుదల అయిన తరువాత అనుష్కను జేజమ్మ, అరుంధతి అని పిలవడం మొదలుపెట్టారు. టాలీవుడ్ లో సీనియర్లను పక్కన పెడితే.. ఇప్పుడున్న హీరోయిన్లలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అరుంధతి పునాది వేసిందనే చెప్పవచ్చు. అరుంధతి తరువాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వచ్చినా అవి అంతగా ప్రేక్షకులను అలరించలేదు. దీంతో అరుంధతి చిత్రం ఆ స్థాయిలో ఇప్పటికీ నిలబడే ఉంది. ఇది అనుష్క కెరీర్‌లో కూడా ఉత్తమ చిత్రాల్లో ఒకటని చెప్పవచ్చు.