Gongura Pachi Royyala Kura : ఆదివారం వస్తుందంటే చాలు.. ఈసారి ఏ మాంసాహారం తినాలా.. అని నాన్‌వెజ్ ప్రియులు ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ఎవరి అభిరుచులు, స్థోమతకు తగినట్లు వారు నాన్‌వెజ్ ఫుడ్‌ను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే నాన్‌వెజ్ ఆహారాల్లో పచ్చి రొయ్యలు చెప్పుకోదగినవి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. సముద్రపు ఆహారం జాబితాకు చెందే ఇవి మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పచ్చి రొయ్యలను గోంగూరతో కలిపి వండుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి రొయ్యలు – ఒక కిలో, గోంగూర – మూడు కట్టలు, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి – 5 రెబ్బలు, ఆవాలు, జీలకర్ర – అర టీస్పూన్ చొప్పున, సన్నగా తరిగిన ఉల్లిపాయలు – రెండు, చీల్చిన పచ్చి మిర్చి – రెండు, పసుపు – అర టీస్పూన్.
పచ్చి రొయ్యలు, గోంగూరను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి పాత్ర పెట్టి అది వేడెక్కాక దాంట్లో గోంగూర వేసి ఉడికించాలి. దీంట్లోనే కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు గిన్నెను కిందకు దించి పప్పు గుత్తితో గోంగూరను మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చి రొయ్యలు వేసి కాసేపు వేయించాలి. తరువాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి ఉడికించాలి. ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన పనిలేదు. రొయ్యల్లో ఉండే నీటితోనే కూర ఉడుకుతుంది. కూర ఉడికి దగ్గరకు రాగానే గోంగూర ముద్దను వేసి బాగా కలపాలి. తరువాత మూత పెట్టి తక్కువ మంటపై కాసేపు ఉడికించి దించేయాలి. దీంతో గోంగూర పచ్చి రొయ్యల కూర రెడీ అవుతుంది. దీన్ని అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రొయ్యలను రొటీన్‌గా కాకుండా ఇలా చేసుకుంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.