Mani Sharma : సంగీత దర్శకుడు మణిశర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించి ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నారు. ఈయన అందించిన సంగీతం, మ్యూజిక్ ట్రాక్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. తెలుగు సినీ రంగంలో అగ్ర హీరోలు అందరికీ ఈయన పనిచేశారు. విజయవంతమైన హిట్ సాంగ్స్‌ను, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించారు. ఇప్పటి వరకు ఆయన కొన్ని వందల సినిమాలకు సంగీతం అందించి పాపులర్ అయ్యారు. మణిశర్మ అందించే సంగీతం ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు.
మణిశర్మ తాను అందించిన సంగీతానికి గాను పలు సినిమాలకు అవార్డులను కూడా పొందారు. నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులను ఆయన దక్కించుకున్నారు. అయితే మణిశర్మ సంగీతం అందించిన కొన్ని సినిమాలను ఇప్పటికీ చూస్తుంటే ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సినిమాలకు చెందిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం)ను వింటుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి అద్భుతమైన బీజీఎంలను అందించిన ఘనత మణిశర్మది.
ఇక మణిశర్మ బీజీఎం అందించిన వాటిల్లో బాలకృష్ణ నరసింహ నాయుడు సినిమా ఒకటి. ఈ సినిమా బీజీఎం వింటుంటూనే అభిమానులకు పూనకాలు వస్తాయి. 2001లో వచ్చిన ఈ మూవీకి బి.గోపాల్ దర్శకుడు. అప్పట్లో భారీ హిట్ సాధించిన చిత్రమిది. దీనికి మణిశర్మ అద్భుతమైన బీజీఎం అందించారు. ఈ బీజీఎం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. అదేవిధంగా మణిశర్మ సంగీతం అందించిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా ఎంతగానో అలరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అద్భుతం అనే చెప్పాలి. 2002లో వచ్చిన ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకుడు. ఈ సినిమా బీజీఎం కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా చెన్నకేశవ రెడ్డి జైలు నుంచి వచ్చాక సొంత ఊర్లో సొంత బిల్డింగ్‌కు చేరుకుని మెట్లు ఎక్కుతున్న సందర్భంలో వచ్చే మ్యూజిక్ అదిరిపోతుంది. ఈ మ్యూజిక్‌కు బాలయ్య అభిమానులు ఊగిపోతారు. అంతలా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే టైటిల్ ట్రాక్ కూడా అదే మ్యూజిక్‌ను కలిగి ఉంటుంది.
చిరంజీవి కెరీర్‌లోని బెస్ట్ చిత్రాల్లో ఇంద్ర ఒకటి. ఇంద్రసేనా రెడ్డిగా చిరు అందులో తన విశ్వరూపం చూపించారు. దీనికి మణిశర్మ సంగీతం అందించారు. ఇంద్ర.. అంటూ సాగే టైటిల్ ట్రాక్, దాని సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే సినిమా బీజీఎం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీని చూస్తుంటే వచ్చే సంగీతానికి ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయి. 2002లో విడుదలైన ఈ సినిమా కూడా సంగీతం పరంగా ఎంతో హిట్ అయింది. చిరంజీవి కెరీర్‌లోనే ఒక బెస్ట్ మూవీగా నిలిచింది.
మహేష్ బాబు తొలిసారిగా కౌ బాయ్ గెటప్‌లో వచ్చిన మూవీ.. టక్కరి దొంగ. ఇందులో మహేష్ భిన్నమైన లుక్‌లో కనిపించి అలరించాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా 2002లో విడుదల కాగా జయంత్ సి.పరాన్జీ దీనికి దర్శకుడు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీ టైటిల్ ట్రాక్, బీజీఎం అద్భుతంగా ఉంటాయి. వీటికి ఇప్పటికీ ప్రేక్షకులు జై కొడుతుంటారు. ఇక మెగాస్టార్ కెరీర్‌లో వచ్చిన మరో బెస్ట్ మూవీ స్టాలిన్. 2006లో విడుదలైన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తోపాటు స్టాలిన్ టైటిల్ ట్రాక్ అద్భుతంగా ఉంటాయి. ప్రేక్షకులు ఇప్పటికీ వీటిని చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా స్టాలిన్ టైటిల్ ట్రాక్ కు మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇలా మణిశర్మ ఎన్నో చిత్రాలకు అద్భుతమైన బీజీఎం అందించారు. అయితే ఆయన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఆయన మ్యూజిక్‌ను మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.