Aditya 369 : మూసధోరణిలో సాగిపోతున్న తెలుగు సినిమాకు థింక్ హట్కే అంటూ కొత్త భాష్యం చెప్పంది ఆ సినిమా. సినిమాను ఇలా కూడా తీయొచ్చా..? అంటూ అందరిచేత నోర్లెళ్లబెట్టించిన చిత్రం బాలకృష్ణ ఆదిత్య 369. ఇందులో ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేం, ప్రతి మాట, ప్రతి పాట అన్నీ సరికొత్తగా ఉంటాయి. వర్తమాన కాలం నుండి భూతకాలంలోకి అక్కడి నుండి భవిష్యత్ కాలంలోకి సినిమాను నడిపించిన తీరెంతో సరికొత్తగా అనిపిస్తుంది. అసలు ఆ ఐడియాకే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుని అభినందించాలి. ఇప్పుడు మరోసారి ఈ సినిమా మీద సీక్వెల్ చేస్తారట. అయితే ఆ సందర్భంగా ఓ సారి ఆదిత్య 369 అనగానే గుర్తుకు వచ్చే 10 అంశాల మీద ఓ లుక్కేద్దాం.
ఆదిత్య 369 అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది టైం మెషీన్. హీరో కంటే కూడా ఎక్కువ పేరు తెచ్చుకుంది ఇది. హీరోలే కాదు వస్తువులు కూడా సినిమాలను శాసిస్తాయి అనడానికి ఫర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. అలాగే ప్రపంచంలోనే అతి గొప్పదైన వజ్రం కోహినూర్. ఈ వజ్రాన్ని దక్కించుకునేందుకు ఎంతోమంది రాజులు యుద్ధాలు చేశారు. కృష్ణదేవరాయల కాలంలో ఈ వజ్రం ఆయన ఆస్థానంలో ఉన్నట్లు సినిమాలో చూపించారు. బ్రిటీష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇండియా నుండి తీసుకెళ్ళారు.
విజయనగర సామ్రాజ్యాన్ని 1509-1529 వరకు పాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తూ, ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా చేస్తూ, దానధర్మాలు చేసేవారు. ఈయన గెటప్ లో అచ్చుగుద్దినట్లుగా సాక్ష్యాత్తూ ఆయననే చూస్తున్నామా అనేట్లుగా బాలకృష్ణ ఆ గెటప్ లో ఒదిగిపోయారు. కవి పండితుడు, సాహిత్యమంటే ఇష్టమైన శ్రీకృష్ణదేవరాయల గెటప్ లో బాలయ్య చెప్పే పద్యాలు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలకి సాహిత్యమన్నా, కవిత్వాలన్నా మక్కువ ఎక్కువ. తన ఆస్థాన సభలో 8 మంది పండితులు ఉండేవారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాయ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు ఉండేవారు. వీరినే అష్టదిగ్గజ కవులుగా పిలిచేవారు. ఈ చిత్రంలో తెనాలి రామకృష్ణుడిగా చంద్రమోహన్ నటన అదుర్స్ అనే చెప్పవచ్చు.
మాటల రచయితగా తెలుగు సినిమాలో సరికొత్త ఒరవడిని సృష్టించిన జంధ్యాల ఆదిత్య 369 సినిమాకు అద్భుతమైన మాటలు రాసి తన సంభాషణలతో మెప్పించారు. మెలోడీ పాటలు, వినసొంపైన గీతాలను అందించడంలో సిద్ధహస్తుడైన ఇళయరాజా ఆణిముత్యాల్లాంటి ఐదు పాటలకు ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి అందమైన పాటలతో మాయ చేశారు. కథకు తగ్గట్లుగా పాటలు సందర్భానుసారంగా ఆకట్టుకున్నాయి. సింగీతం శ్రీనివాసరావు కథ, స్క్రీన్ ప్లే ఒకెత్తైతే, దర్శకత్వ ప్రతిభతో మెప్పించారు. టాలీవుడ్ లో తెరకెక్కిన మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఇప్పటికీ ఆదిత్య 369 సినిమా నిలిచింది.
తెలుగులో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు పొంది తెలుగు సినిమా గతిని మార్చిన చిత్రంగా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.9 కోట్లు వసూల్ చేసింది. అప్పట్లో ఇదో రికార్డు. ఈ చిత్రాన్ని తమిళ్ లో అపూర్వ శక్తి 369, హిందీలో మిషన్ 369 గా డబ్ చేశారు. 2008లో ఈ చిత్రాన్ని లవ్ స్టొరీ 2050గా రీమేడ్ చేశారు. ప్రియాంకచోప్రా, హమన్ బవేజా జంటగా నటించారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ పోషించారు. బాలకృష్ణ సరసన మోహిని హీరోయిన్ గా నటించింది. తరుణ్ మ్యూజియంలో వజ్రం దొంగతనానికి వచ్చినప్పుడు చూసే పిల్లాడిగా ఇందులో నటించాడు. టైం మిషన్ కనిపెట్టే సైంటిస్ట్ గా టిన్ను ఆనంద్, పురాతన వస్తువులను దక్కించుకునే పాత్రలో అమ్రిష్ పురి, రాయలవారి ఆస్థాన నర్తకిగా సిల్క్ స్మిత నటించారు.
తెలియక టైంమెషీన్ ఎక్కి బాలకృష్ణ, మోహినీలతోపాటు రాయల కాలంలోకి వెళ్లే మరో పాత్ర సుత్తివేలుది. ఫన్ ను పంచుతూనే స్టోరీనీ క్యారీ చేసే క్యారెక్టర్ అతనిది. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను మిక్స్ చేసి అందరిచే సూపర్ అనిపించుకుంది ఆదిత్య 369 సినిమా. అయితే దీనికి త్వరలోనే సీక్వెల్ తీస్తామని ఇప్పటికే బాలయ్య చెప్పారు. తానే కథ అందిస్తానని, దర్శకత్వం చేస్తానని.. తన తనయుడు మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడని అనౌన్స్ చేశారు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.