sports

Jersey Numbers : క్రికెట్‌లో ప్లేయ‌ర్లు ధ‌రించే జెర్సీల‌పై నంబ‌ర్లు ఎందుకు ఉంటాయి ? వాటిని ఎలా కేటాయిస్తారు ?

Jersey Numbers : మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ప్రేక్ష‌కులు ఎంతో కాలం నుంచి క్రికెట్‌ను వీక్షిస్తున్నారు. క్రికెట్ మ‌న దేశ జాతీయ ఆట కాదు. అయిన‌ప్ప‌టికీ క్రికెట్‌కే మ‌న దేశంలో ఎక్కువ ఆద‌ర‌ణ ఉంది. ఇక క్రికెట్ మ్యాచ్‌ల సంద‌ర్భంగా ప్లేయ‌ర్లు ర‌క‌ర‌కాల జెర్సీల‌ను ధ‌రిస్తుంటారు. వారి జెర్సీల వెనుక నంబ‌ర్లు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు స‌చిన్ టెండుల్క‌ర్ ఒక‌ప్పుడు క్రికెట్ ఆడిన స‌మ‌యంలో ఆయ‌న జెర్సీ వెనుక ఎల్ల‌ప్పుడూ 10 అనే నంబ‌ర్ ఉండేది. అయితే ఈ నంబ‌ర్ల‌ను ఎందుకు ప్రింట్ చేస్తారు ? అస‌లు ప్లేయ‌ర్ల‌కు వాటిని ఎలా కేటాయిస్తారు ? అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెట్‌లోనే కాదు, మైదానంలో ఆడే ఏ ఆట‌లో అయినా స‌రే.. ప్లేయ‌ర్ల జెర్సీల‌పై నంబ‌ర్లు ఉంటాయి. దీంతో ప్రేక్ష‌కులు, ఆయా క్రీడ‌ల‌కు చెందిన సిబ్బంది, ప్ర‌త్య‌ర్థి ప్లేయ‌ర్లు, కామెంటేట‌ర్లు.. ప్లేయ‌ర్ల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. పేర్లు దూరం నుంచి స‌రిగ్గా క‌నిపించ‌వు. నంబ‌ర్లు పెద్ద అక్ష‌రాల‌తో ఉంటాయి క‌నుక సుల‌భంగా క‌నిపిస్తాయి. దీంతో ఏ ప్లేయ‌ర్ ఎలా ఆడుతున్నాడో తెలుసుకోవ‌చ్చు. అందుకు అనుగుణంగా కామెంటేట‌ర్లు కామెంట్రీ కూడా చెబుతారు. ఇలా ప్లేయ‌ర్ల‌ను సుల‌భంగా గుర్తించేందుకు వారి జెర్సీల‌పై నంబ‌ర్ల‌ను వేస్తారు. ఇదీ.. అస‌లు విష‌యం. ఇక క్రికెట్ ప్లేయ‌ర్ల‌కు అస‌లు జెర్సీ నంబ‌ర్ల‌ను ఎలా కేటాయిస్తారంటే.. ఆయా దేశాల‌కు చెందిన క్రికెట్ బోర్డులు త‌మ ప్లేయ‌ర్ల‌కు వారికి న‌చ్చిన నంబ‌ర్ల‌ను తీసుకునే వెసులుబాటును క‌ల్పించాయి. అందువ‌ల్ల ప్లేయ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన నంబ‌ర్‌ను ఎంచుకోవ‌చ్చు. దీంతో అదే నంబ‌ర్‌ను వారు ధ‌రించే జెర్సీల‌పై వేస్తారు.

do you know how cricket players will get numbers on their Jerseys

అయితే ఇలా జెర్సీ నంబ‌ర్ల‌ను ప్లేయ‌ర్లు త‌మ‌కు ఇష్ట‌మైన నంబ‌ర్లే కాకుండా.. ఇత‌ర ఏ నంబ‌ర్లు అయినా వేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక ప్లేయ‌ర్ వ‌న్డేలు, టీ20లు, టెస్టులు అన్నీ క‌లిపి 300 మ్యాచ్‌లు ఆడాడ‌ని అనుకుంటే.. అత‌ను త‌న జెర్సీపై 300 అని వేసుకోవ‌చ్చు. ఇక ఒక ప్లేయ‌ర్ తాను నివ‌సించే ప్రాంతంలో ఉన్న రోడ్డు నంబ‌ర్ 23 అయితే.. అది త‌న‌కు న‌చ్చితే త‌న జెర్సీపై ఆ నంబ‌ర్‌ను వేసుకోవ‌చ్చు. ఇలా ఏ ప్లేయ‌ర్ అయినా స‌రే త‌న‌కు న‌చ్చిన ఎలాంటి నంబ‌ర్‌ను అయినా స‌రే త‌న జెర్సీపై వేసుకునే వెసులుబాటును ఐసీసీ క‌ల్పించింది. అయితే మాజీ క్రికెట‌ర్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ మొద‌ట్లో 99 నంబ‌ర్ ను జెర్సీపై వేసుకునేవాడు. కానీ త‌రువాత 10 నంబ‌ర్‌ను వేసుకోవ‌డం ప్రారంభించాడు. ఇక ఆయ‌న క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేవ‌ర‌కు అదే నంబర్‌ను అన్ని ర‌కాల జెర్సీల‌పై వేసుకున్నాడు. ఆయ‌న రిటైర్ అయ్యాక ఆ నంబ‌ర్‌కు కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ఇచ్చేసింది. దీంతో రోహిత్ శ‌ర్మ త‌న‌కు నంబ‌ర్ 10 జెర్సీపై కావాల‌ని అడిగినా రోహిత్‌కు బీసీసీఐ ఆ నంబ‌ర్‌ను ఇవ్వ‌లేదు.

కాగా ఇలా జెర్సీల‌పై నంబ‌ర్లు వేసే ప‌ద్ధ‌తి క్రికెట్‌లో మొద‌టిసారిగా 1995-96లో ప్రారంభ‌మైంది. ఆ ఏడాదిలో ఆస్ట్రేలియా, శ్రీ‌లంక‌, వెస్టిండీస్‌లు ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ ఆడాయి. ఆసీస్ టీమ్ ముందుగా త‌మ జెర్సీల‌పై నంబ‌ర్ల‌ను వేసుకుంది. దీంతో అప్ప‌టి నుంచి అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇక టెస్టుల్లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు జెర్సీల‌పై నంబ‌ర్ల‌ను వేసేవారు కాదు. కానీ ఈ మ‌ధ్య నుంచే టెస్టుల్లో ఆడే ప్లేయ‌ర్లు కూడా నంబ‌ర్లు క‌లిగిన జెర్సీల‌ను ధ‌రిస్తున్నారు. 2019లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన యాషెస్ సిరీస్ నుంచి టెస్టుల్లోనూ ప్లేయ‌ర్లు జెర్సీల‌పై నంబ‌ర్ల‌ను వేసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఇదీ.. ఆ నంబ‌ర్ల వెనుక ఉన్న క‌థ‌..!

Admin

Recent Posts