Sr NTR : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు అన్న పదాలకు నిలువెత్తు రూపం నందమూరి తారక రామారావు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చి వెండితెరకు దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు ఎన్టీఆర్. తెలుగు తెర ప్రేక్షకులకు మొదటిగా రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఎనలేని సేవలు ఎన్నో ఇండస్ట్రీకి అందించారు. కథానాయకుడు గానే కాదు రాష్ట్ర నాయకుడు కూడా తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు.
ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం కూడా ఒకటి. అప్పట్లో ఈ చిత్రం రిలీజ్ కాకుండా ఉండటానికి ఎన్నో రాజకీయ కుతంత్రాలు జరిగాయట. ఈ చిత్రం గాని రిలీజైతే కచ్చితంగా ఎన్టీఆర్ సీఎం అవుతారనే భయంతో ఆ చిత్రాన్ని రిలీజ్ కాకుండా ఆపేశారట. ఇంతకీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాన్ని రిలీజ్ కాకుండా అడ్డుకున్నది ఎవరు..? ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్తే..
ఎన్టీఆర్ ఒకసారి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమానికి వెళ్లి బ్రహ్మం గారి చెక్క చెప్పులను ధరించటం, అవి ఆయన కాళ్లకు సరిగ్గా సెట్ అవ్వడంతో ఏదో తెలియని భావోద్వేగానికి లోనయ్యారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భవిష్యత్తును తెలియజేసే వీరబ్రహ్మేంద్రస్వామి పాత్రలో నటించడం జరిగింది. భవిష్యత్తులో ఈ విధంగా జరుగుతుంది అని బ్రహ్మంగారి చెప్పే మాటలలో భాగంగా తెరమీది బొమ్మలు ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తాయని బ్రహ్మంగారు చెప్పిన విషయం ఎన్టీఆర్ ను ఎంతగానో ఆకర్షించిందట.
దాంతో బ్రహ్మంగారి చరిత్రపై సినిమా తీయాలనుకున్న ఎన్టీఆర్ ఏడాది పాటు పరిశోధించి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. 1980లో షూటింగ్ పనులు ప్రారంభమై 1981లో ఈ సినిమా రిలీజ్ కు వచ్చేసింది. కానీ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది. దీంతో ఎన్టీఆర్ కోర్ట్ కు వెళ్లి 3 సంవత్సరాల న్యాయపోరాటం చేసి ఆ తర్వాత ఈ చిత్రాన్ని రీలీజ్ చేయించుకున్నారు.
ఈ చిత్రం రిలీజ్ వెనుక ఇంత కథ జరగడానికి ఒక పెద్ద హస్తం ఉందని అప్పట్లో టాక్ వినిపించేది. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు.. మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. 1981లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఇందిరాగాంధీ హస్తం ఉందని అప్పట్లో టాక్ వినిపించేది. ఈ సినిమా కనుక రిలీజైతే ఎన్టీఆర్ సీఎం అవుతారని ఇందిరా గాంధీకి ఎవరో చెప్పారట. అందుకే ఈ సినిమాను రిలీజ్ కాకుండా ఇందిరాగాంధీ అడ్డుపడ్డారని అప్పట్లో వార్తలు ప్రసారం అయ్యేవి. ఎన్ని కుతంత్రాలు జరిగినా ఆఖరికి చిత్రం రిలీజ్ అయ్యి బ్రహ్మంగారు చెప్పినట్టుగానే తెరమీద బొమ్మలు రాష్ట్రాన్ని ఏలుతారు అనే మాట నిజమై 1983 జనవరి 9న ఎన్టీఆర్ సీఎం అయ్యారు.