Dasari Narayana Rao : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు శత్రువులు పెద్దగా ఎవ్వరూ లేరు. అందరూ ఆయనతో స్నేహంగానే ఉండేవారు. అయితే దర్శకరత్న దాసరినారాయణరావు మొదట ఎన్టీఆర్ కి ప్రాణ స్నేహితుడిగా ఉండేవారట. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టే సమయానికి వీళ్లిద్దరూ బద్ధశత్రువులుగా మారిపోయారని అప్పట్లో టాక్. అసలు దీనికి కారణం ఏంటంటే..
దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ చాలా సినిమాలే తీశారు. వీళ్ళు చాలా సన్నిహితంగానే ఉండేవారు. వీరి కాంబోలో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దాసరి నారాయణరావు తీసే సినిమాలు అన్నగారిని రాజకీయంగా ప్రేరేపించాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే చిన్నతనం నుంచి దాసరికి ఏఎన్నార్ అంటే చాలా అభిమానం ఉండేదట. ఆ తరువాత అక్కినేనితో గ్యాప్ రావడంతో దాసరి, ఎన్టీఆర్ బంధం బలపడిందని చెబుతుంటారు. ఇక కొంత కాలానికే వీరి మధ్య వైరం పెరిగింది. ఆ సమయంలో అసలు దాసరికి షూటింగ్ కోసం స్టూడియోలు కూడా ఇవ్వవద్దని ఎన్టీఆర్ కొందరికి చెప్పేవరకు వెళ్లిందట.
ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు తీసిన దాసరి నారాయణరావుకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఎవ్వరూ ఊహించలేదట. దాసరి ఇందిరా గాంధీకి పెద్ద ఫ్యాన్ అంట. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండేవాడట. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఇందిర దాసరికి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈనాడు పత్రికలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కథనాలు వస్తే.. దాసరి ఉదయం పత్రికను ప్రారంభించి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా వార్తలు రాయించారట. ఎన్టీఆర్ రెండోసారి ఓడిపోవడానికి దాసరి నారాయణరావు కూడా ఓ కారణమని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అందుకే రాజకీయం ఎంతటి మిత్రులనైనా శత్రువులుగా మారుస్తుంది అంటారు.