Exercise : నడుమూ చుట్టూ లావుగా ఉంటే మనిషి అంతా లావుగా ఉన్నట్టే కనిపిస్తారు. చూడచక్కని నాజుకైన నడుము కోసం మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రోజూ కింద చెప్పిన విధంగా వ్యాయామం చేయడం వల్ల నాజూకైన నడుము మీ సొంతమవుతుంది. సన్నని నడుము మీ సొంతం కావాలంటే .. ఇలా ప్రయత్నించండి.
1. నిలబడి కాళ్లను కాస్త దూరంగా జరిపి ఎడమ చేతిని నడుము మీద ఆనించాలి. ఇప్పుడు కుడి మోకాలిని పైకి లేపి కుడి మోచేతిని దానికి తగిలించాలి. తర్వాత ఎడమ మోకాలితోనూ ఇలాగే చేయాలి. ఇలా సెట్టుకి ఇరవై చొప్పున రెండు సార్లు చేయాలి.
2. కింద కూర్చొని రెండు మోకాళ్లను పైకి లేపాలి. రెండు చేతులను ఏదో పట్టుకున్నట్టుగా కాస్త దగ్గరిగా పెట్టాలి. ఇప్పుడు చేతులను ఒక సారి కుడి వైపు, మరో సారి ఎడమ వైపు తిప్పాలి. ఇలా ముప్పై సార్లు చేయాలి.
3. నేల మీద కూర్చొని రెండు కాళ్లను కాస్త పైకి పెట్టాలి. రెండు చేతులను చెవులకు ఆనించి మోచేతులను మడవాలి. తర్వాత ఒక కాలిని నిటారుగా ఉంచి మరో కాలిని మడవాలి. మడిచిన కుడికాలును కుడి మోచేత్తో తాకాలి. అలాగే ఎడమ కాలిని మడిచినప్పుడు ఎడమ చేత్తో తాకాలి. ఇలా రెండు కాళ్లతోనూ సెట్టుకు ఇరవై చొప్పున రెండు సార్లు చేయాలి.
4. వెల్లకిలా పడుకుని కాళ్లను మడిచి పాదాలను నేల మీద ఆనించాలి. తల, భుజాలను కాస్త పైకి లేపి చేతులను నిటారుగా ముందుకు చాపి, ఒకసారి కుడివైపు, మరోసారి ఎడమ వైపు వంగాలి.
ఈ విధంగా వ్యాయామాలను చేయడం వల్ల నడుము వద్ద ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. నడుము నాజూగ్గా సన్నగా తయారవుతుంది.