నిత్యం మనం తినే ఆహారాలు, పాటించే అలవాట్లు, తిరిగే వాతావరణం వల్ల శరీరంలో మలినాలు చేరుతుంటాయి. అయితే శరీరం తనను తాను అంతర్గతంగా శుభ్రం చేసుకుంటూనే ఉంటుంది. కానీ మలినాలు మరీ ఎక్కువగా పేరుకుపోతే శరీరం కూడా ఏమీ చేయలేదు. కనుక మన శరీరాన్ని మనమే అంతర్గతంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీన్నే డిటాక్సిఫికేషన్ అంటారు. ఆయుర్వేద ప్రకారం ఈ ప్రక్రియను శోధన ప్రక్రియ అని పిలుస్తారు. అంటే శరీరంలోని రక్తంతోపాటు పలు ఇతర అవయవాల్లో ఉన్న మలినాలను తొలగించుకోవడం అన్నమాట. శరీరంలోని కిడ్నీలు, లివర్, చర్మం, పేగులు వంటి అవయవాలను శుభ్రం చేసుకోవాలి. వాటిల్లో ఉండే మలినాలను తొలగించుకోవాలి. దీంతో ఆయా అవయవాలు చక్కగా పనిచేస్తాయి. రక్తప్రసరణ మెరుగు పడుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
వేడి నీళ్లు శరీరంలోని మలినాలను బయటకు పంపేందుకు సహాయ పడతాయి. కనుక వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిది. దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల డిటాక్సిఫికేషన్‌కు ప్రోత్సాహం అందించినట్లు అవుతుంది.
రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
దేవుళ్ల పేర్లతో కొందరు ఉపవాసాలు చేస్తారు. నిజానికి శారీరక ఆరోగ్యానికి ఉపవాసం ఎంతో మంచిది. వారంలో ఒకటి లేదా రెండు రోజులు ఉపవాసం చేయడం వల్ల కూడా శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఉపవాసం సమయంలో కేవలం పండ్ల రసాలు మాత్రమే తాగుతుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. దీంతో శరీర అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. వ్యర్థాలు త్వరగా బయటకు పోతాయి.
ఉపవాసం సమయంలో పండ్ల రసాలతోపాటు మజ్జిగ, హెర్బల్ టీ, బార్లీ నీళ్లు, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవడం మంచిది. దీని వల్ల నీరసం రాకుండా ఉంటుంది. శక్తి, ఉత్సాహం వస్తాయి. ఉత్తేజంగా మారుతారు.
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కనీసం ఆరు నెలలకు ఒకసారి పంచకర్మ చికిత్సను చేయించుకోవాలి. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఇందులో 5 విధానాలతో శరీరాన్ని శుభ్రం చేస్తారు. మీకున్న అనారోగ్య సమస్యలను బట్టి వైద్యులు ఆ ఐదు విధానాల్లో ఎంపిక చేసిన విధానాలతో పంచకర్మ చికిత్స చేస్తారు. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే చిక్కుళ్లు, తోటకూర, బ్రౌన్ రైస్, తాజా పండ్లు, కూరగాయలు, క్యాబేజీ వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు పోతాయి.
మజ్జిగ, త్రిఫల చూర్ణం, పసుపు, ఇంగువ, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, నారింజ, ఉసిరి వంటి ఆహారాలను తీసుకుంటున్నా శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
ప్రతి రోజూ అన్నం మొదటి ముద్దలో పాత ఉసిరికాయ పచ్చడి తినడం మేలు. రోజూ తగినంత నీటిని తాగాలి. ఉదయం, సాయంత్రం శ్వాస వ్యాయామాలు చేయాలి. వారంలో ఒక రోజు నువ్వుల నూనెతో శరీరం మొత్తం మర్దనా చేసి స్నానం చేయాలి. అలాగే పెసర పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని కొంత సేపటి తరువాత స్నానం చేయాలి. వీటన్నింటిని పాటిస్తుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరంలో మలినాలు ఉండవు. అనారోగ్యాలు దరి చేరవు.
ఒక టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ జీలకర్ర పొడి, నాలుగు టీస్పూన్ల కొత్తిమీర పొడి, నాలుగు టీస్పూన్ల సోంపులను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నెయ్యిలో వేడి చేసుకుని అన్నం మొదటి ముద్దలో తినాలి. ఇలా చేసినా వ్యర్థాలను బయటకు పంపవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365