Diabetes : ప్రస్తుత తరుణంలో డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. చిన్న వయస్సులోనే ఈ వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువవుతున్నారు. ఈ డయాబెటిస్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం.. ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉండడం. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. మన శరీరంలో క్లోమంలో తయారు చేయబడి రక్తంలోకి విడుదల అవుతుంది. ఇన్సులిన్ మన జీవక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం భోజనం చేసిన తరువాత మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. వెంటనే క్లోమం ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. అప్పుడు గ్లూకోజ్, ఇన్సులిన్ రక్తం నుండి శరీరంలోని అన్ని కణాలలోకి ప్రవేశిస్తాయి. మన శరీరంలోని కణాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ ను గ్రహించడానికి ఇన్సులిన్ సహాయపడుతుంది. ఇన్సులిన్ నిరోధకత అనేది ఒక రకమైన పరిస్థితి.
ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉండడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ ను కణాలు గ్రహించవు. దీంతో ఈ గ్లూకోజ్ రక్తంలో పేరుకు పోయి ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులకు కు దారి తీస్తుంది. ఇన్సులిన్ నిరోధకత రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కార్బొహైడ్రేట్స్ ను కలిగిన ఆహార పదార్థాలను అధికంగా తినడం, ఊబకాయం, ఉప్పును అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం.. వంటి వాటిని ఇన్సులిన్ నిరోధకత రావడానికి గల ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మనం ఇన్సులిన్ నిరోధకతను అధిగమిస్తే డయాబెటిస్ వ్యాధిని నివారించుకోవచ్చు. మనం తినే ఆహారంలో, మన జీవన విధానంలో మార్పులు చేయడం ద్వారా ఈ ఇన్సులిన్ నిరోధకతను అధిగమించవచ్చు.
ప్రతి రోజూ వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోవాలి. వాకింగ్, ఆసనాలు, వ్యాయామం వంటివి చేయడానికి శరీరానికి శక్తి ఎక్కువగా అవసరమవుతుంది. ఈ శక్తి కోసం కణాలు ఇన్సులిన్ తోపాటుగా గ్లూకోజ్ ను ఎక్కువగా గ్రహిస్తాయి. దీని వల్ల ఇన్సులిన్ నిరోధకతతోపాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి డయాబెటిస్ నియంత్రించబడుతుంది. రోజూ రెండున్నర గంటలు వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ రాకుండా ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వారు భోజనం చేసిన తరువాత కనీసం ఒక గంట సమయం పాటు వాకింగ్ చేయడం వల్ల చాలా మేలు కలుగుతుంది.
మనం ఆహారంలో రుచి కోసం ఉపయోగించే ఉప్పును తగ్గించాలి. ఈ ఉప్పులో కొంత భాగమే మన శరీరం నుండి చెమట, మూత్రం రూపంలో బయటకు వెళ్తుంది. మన శరీరంలో మిగిలిన ఉప్పు కణాల చుట్టూ పొరలా పేరుకు పోతుంది. ఈ పొర గట్టిపడడం వల్ల ఇన్సులిన్ ను, గ్లూకోజ్ ను కణాలు గ్రహించవు. దీని వల్ల డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. రోజుకి 2-3 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినే వారికి 72 శాతం డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కనుక మనం తినే ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించడం వల్ల డయాబెటిస్ వ్యాధి నియంత్రించబడుతుంది.
పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. అన్నానికి బదులుగా రాత్రి భోజనంలో పుల్కాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రించబడుతుంది. ఈ పద్దతులను పాటించడం వల్ల డయాబెటిస్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటారు.