Categories: Featured

వంట నూనెల గురించి పూర్తి వివరాలు.. ఏ నూనె మంచిదో తెలుసుకోండి..!

మనిషి శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. శరీరంలోని అన్ని అవయవాలు ఎంతో విలువైనవి. అవన్నీ శక్తివంతంగా పనిచేస్తాయి. అన్ని అవయవాలు కలసి కట్టుగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. దీంతో ఆ ప్రభావం అవయవాలపై పడుతోంది. సాధారణంగా చాలా మంది ఉడకబెట్టిన పదార్థాల కన్నా నూనెలో వేయించిన పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యాతను ఇస్తారు. అవంటేనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. వాటినే ఎక్కువగా తింటారు. డాక్టర్లు ఓ వైపు వేపుళ్లను తినవద్దని చెప్పినా పట్టించుకోరు. నూనె పదార్థాల వైపే మొగ్గు చూపుతారు. నూనె లేకపోతే అసలు ఏమీ చేయలేం.. అన్నట్లుగా పరిస్థితి మారింది.

full information about cooking oils know the details

వంట పాత్రలో నూనె ఎక్కువగా పోసి అందులో కూరగాయలు వేసి వాటిని ఫ్రై చేసి తింటుంటారు. కానీ వాటి వల్ల శరీరానికి కలిగే కీడు గురించి పట్టించుకోరు. అయితే ప్రస్తుతం గుండె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో నూనె వాడకాన్ని కచ్చితంగా తగ్గించాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మనం వాడుతున్న నూనెల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్‌లో ప్రస్తుతం అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ మన ఆరోగ్యానికి అనుగుణంగా ఉండే నూనెలను మాత్రమే వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మార్కెట్‌లో అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అసలు వంటలకు ఏ నూనెను వాడాలని చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. మా నూనె మంచిందంటే మా నూనె మంచిదని కంపెనీలు తమ నూనెల గురించి యాడ్స్‌లో ఊదరగొడుతుంటాయి. దీంతో ప్రజల్లో ఇంకా గందరగోళం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే వంట నూనెలపై అనేక అపోహలు, అనుమానాలు, సందేహాలు నెలకొంటున్నాయి.

మార్కెట్‌లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్న దృష్ట్యా మన శరీరానికి ఏ నూనె మంచిదో తెలుసుకోవాలంటే కొద్దిగా శ్రమించాలి. అన్ని రకాల నూనెల గురించి తెలుసుకోవాలి. శాచురేటెడ్‌, అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ అంటే ఏమిటి ? రిఫైన్డ్‌, ఫిల్టర్డ్‌ నూనెల మధ్య తేడాలు ? ఖరీదైనా ఆలివ్‌ నూనెను వాడాలా ? కుటుంబాలకు ఏ నూనె మంచిది ? మన శరీరానికి ఏ నూనెలు మేలు చేస్తాయి ? ఏయే కొవ్వులు అవసరం ? ఏవి హానికరం ? వంటి అంశాలపై అవగాహనను పెంపొందించుకోవాలి. అన్ని విధాలుగా శ్రేయస్కరమైన నూనెలను ఎంచుకుని వాడాలి.

సాధారణంగా మన ఇళ్లలో సంప్రదాయ వంట నూనెలను లేదా రిఫైన్డ్‌ నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. హోటల్స్‌, రెస్టారెంట్స్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌, మిర్చీ బజ్జీ బండ్లు, నూడుల్స్‌ బండ్లు, చాట్‌ మసాలా సెంటర్లలో భిన్న రకాల నూనెలను వాడుతుంటారు. వారు ఒకసారి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతారు. అలాంటి నూనెలు మన శరీరానికి మంచిది కాదు. కనుక ఆయా ప్రదేశాల్లో ఆహారాలను తినడం వల్ల మన శరీరానికి హాని కలుగుతుందనే విషయాన్ని గ్రహించాలి.

కొలెస్ట్రాల్‌.. ఈ పదం గురించి అందరికీ తెలిసిందే. ఇది రక్త ప్రసరణలో శరీర కనాలలో కనిపించే పదార్థం. ఇది శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఆహారం నుంచి కూడా లభిస్తుంది. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి లో డెన్సిటీ లైపో ప్రోటీన్‌ (ఎల్‌డీఎల్‌). దీన్నే చెడు కొలెస్ట్రాల్‌ అంటారు. ఇంకొకటి హై డెన్సిటీ లైపోప్రోటీన్‌ (హెచ్‌డీఎల్‌). దీన్నే మంచి కొలెస్ట్రాల్‌ అంటారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) స్థాయిలు పెరిగితే అది గుండె జబ్బులను కలగజేస్తుంది.

నూనెలలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఆహార పదార్థాల్లోనే.. అదీ మాంసం, కోళ్లు, సీ ఫుడ్‌, గుడ్లు, పాలు, పాల పదార్థాలు, వెన్న వంటి జంతు సంబంధ పదార్థాల్లోనే కొలెస్ట్రాల్‌ ఉంటుంది. వీటిని మితిమీరి తీసుకుంటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. దీంతో గుండెకు హాని కలుగుతుంది. కనుక కొలెస్ట్రాల్‌ ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.

ఇక అన్‌శాచురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలను రెండు వర్గాలుగా విభజించారు. ఒకటి మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌, రెండోది పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌. మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇవి హాని కలిగించవు. తక్కువ ధర కలిగి ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఆలివ్‌ నూనె, ఆవనూనె, వేరుశెనగ నూనె, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌, నువ్వుల నూనెలో ఉంటాయి.

ఇక పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లను రెండు గ్రూపులుగా విభజించవచ్చు. వీటినే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు అని పిలుస్తారు. ఇవి శరీరానికి అవసరం. కానీ వీటిని శరీరం తయారు చేసుకోలేదు. కనుక ఇవి ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి ఎంతో ముఖ్యమైనవి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు, రక్తపోటును నియంత్రించేందుకు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు దోహదపడతాయి.

ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా కుసుమ గింజల నూనె, పొద్దు తిరుగుడు పువ్వుల నూనె, మొక్కజొన్న గింజల నూనెల్లో ఉంటాయి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా సోయా చిక్కుడు గింజల నూనె, ఆవనూనె, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌, నువ్వుల నూనె, బాదంనూనెలలో ఉంటాయి.

ఇక వంట నూనె కొవ్వు పదార్థం జాబితాకు చెందుతుంది. వీటిల్లో పైన తెలిపిన ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అయితే మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండే నూనెలను మనం వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చు.

వేరుశెనగ నూనె

దీంట్లో గుండెకు మేలు చేసే మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దరిచేరనియ్యవు. అనేక పోషకాలు ఈ నూనెలో ఉంటాయి.

ఆలివ్‌ నూనె

ఇతర నూనెల కన్నా ఈ నూనె ఖరీదు చాలా ఎక్కువ. అయినప్పటికీ ఇది అందించే ప్రయోజనాలు అద్భుతం అని చెప్పవచ్చు. ఈ నూనె గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. దీంట్లోనూ మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఈ నూనెను ఎక్కువగా సలాడ్స్‌పై చల్లుకుని తీసుకుంటారు. దీంట్లోనూ అనేక పోషకాలు లభిస్తాయి.

సోయా చిక్కుడు నూనె

పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఈ నూనెలో ఉంటాయి. ఈ నూనెను వేపుళ్లకు కాకుండా ఇతర ఏ అవసరానికైనా వాడవచ్చు. ఈ నూనెను వేపుళ్లకు వాడితే నూనె బాగా ఫ్రై అవుతుంది కనుక అందులోంచి విష పదార్థాలు బయటకు వస్తాయి. కనుక వేపుళ్లకు ఈ నూనె పనికిరాదు.

ఆవ నూనె

ఈ నూనెను పశ్చిమబెంగాల్‌ వాసులు ఎక్కువగా వాడుతుంటారు. ఇది సహజసిద్ధమైన రుచి, సువాసనను అందిస్తుంది. పచ్చళ్ల తయారీలో ఈ నూనెను ఎక్కువగా వాడుతారు. ఈ నూనెలో మోనో, పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు రెండూ ఉంటాయి. కనుక ఇది ఆరోగ్యవంతమైన నూనె అని చెప్పవచ్చు.

రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌

ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఈ నూనెలో ఆరిజినాల్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంట్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగానే ఉంటాయి.

పొద్దు తిరుగుడు పువ్వు నూనె, కుసుమ నూనె

సాధారణంగా ఈ నూనెలను ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు. వీటిలో పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

కొబ్బరినూనె

దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఇతర ఆసియా దేశాల వాసులు ఈ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంట్లో శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.

అవిసె గింజల నూనె

అవిసె గింజలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయినప్పటికీ వీటి నూనెను వాడేవారు చాలా తక్కువగా ఉంటారు. ఈ నూనెలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి మేలు చేస్తాయి.

ఏ నూనె మంచిది ?

మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉండే నూనెలు అన్నీ గుండెకు మేలు చేస్తాయి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే సోయాబీన్‌, ఆవ నూనెలు కూడా మంచివే. ఆలివ్‌ నూనె, రైస్‌బ్రాన్‌ అయిల్, వేరుశెనగ నూనెలలో మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అయితే అన్ని నూనెలు ఆరోగ్యకరమైనే అయినా ఒక్కో నూనె భిన్న రకాల ప్రయోజనాలను అందిస్తుంది కనుక వంట నూనెలను తరచూ మార్చి వాడుతుంటే మంచిది. దీంతో అన్ని నూనెల్లోని పోషకాలు అందుతాయి. అన్ని నూనెల ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు.

ఇక సలాడ్స్‌ కోసం ఆలివ్‌ నూనెను, వేపుళ్లకు వేరు శెనగ నూనెను, ఇతర అవసరాల కోసం సోయాబీన్‌ నూనెను వాడవచ్చు. పచ్చళ్ల కోసం ఆవ నూనె వాడవచ్చు. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ను రోజూ చేసే కూరలకు వాడవచ్చు. దీంతో పోషకాలు లభిస్తాయి. ఇలా అన్ని రకాల నూనెలను వాడితే మంచిది. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న చాలా నూనెలు రీఫైన్డ్‌ చేసినవే. వాటిల్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. కనుక గానుగలో ఆడించిన ఆయా నూనెలను వాడితే మేలు. దీని వల్ల పోషకాలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. పైగా గానుగలో ఆడించిన నూనెలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts