Liver Cleaning : చిన్న పని చేసినా విపరీతమైన అలసట వస్తుందా ? అసలు ఏమాత్రం పనిచేయలేకపోతున్నారా ? జీర్ణాశయ సంబంధిత సమస్యలు ఉన్నాయా ? అయితే మీ లివర్ సరిగ్గా పనిచేయడం లేదేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆయా లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. లివర్ లో ఏదైనా సమస్య ఉందేమోనని అర్థం చేసుకోవాలి. మన శరరీంలో లివర్ అనేక రకాల పనులు చేస్తుంది. వాటికి ఆటంకం కలిగితే పైన తెలిపిన లక్షణాలను చూపిస్తుంది.
మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను లివర్ బయటకు పంపుతుంది. శరీరానికి శక్తి అందేలా చేస్తుంది. ఎంజైమ్‌లను ఉత్తేజం చేస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లను జీర్ణం చేసి శరీరానికి శక్తి వచ్చేలా చేస్తుంది. అయితే కొందరికి లివర్ సమస్యలు వస్తుంటాయి. దీంతో జీర్ణ సమస్యలతోపాటు అలసట, నీరసం వంటివి వస్తాయి. ఈ లక్షణాలు ఉంటే లివర్ సరిగ్గా పనిచేయడం లేదని తెలుసుకోవాలి.
లివర్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మందులను వాడడంతోపాటు పలు రకాల ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. మరి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి లివర్‌కు సహకారం అందిస్తాయి. లివర్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. వెల్లుల్లిలో అధికంగా ఉంటే సెలీనియం లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయ పడుతుంది. కనుక రోజూ వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకుంటే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందుకు గాను రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుండాలి. నేరుగా తినలేకపోతే వాటిని తేనేతోపాటు తీసుకోవచ్చు. దీని వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడి అందులోని వ్యర్థాలు బయటకు పోతాయి.
2. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను రోజూ తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూరను తినడం వల్ల అనేక సమ్మేళనాలు లభిస్తాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
3. ఫైబర్ అధికంగా ఉండే యాపిల్ పండ్లు, క్యారెట్లు, కాలిఫ్లవర్, బీట్ రూట్ వంటి వాటిని రోజూ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అందులోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోయి లివర్ శుభ్రమవుతుంది.
4. రోజూ 2 నుంచి 3 కప్పుల గ్రీన్‌టీని తాగడం వల్ల కూడా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గ్రీన్‌టీలో ఉండే కాటెకిన్స్ అనబడే వృక్ష ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లు లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. లివర్‌లోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
5. పసుపును రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్ దెబ్బ తిన్నవారు పసుపును తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా మారుతుంది. లివర్ దెబ్బతినకుండా చూసుకోవచ్చు. లివర్ లోని కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. బైల్ ఉత్పత్తి పెరుగుతుంది. గాల్ బ్లాడర్ సరిగ్గా పనిచేస్తుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పసుపును రోజూ వేడి నీటిలో లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు.
6. నిమ్మ, నారింజ వంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను రోజూ తినాలి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ క్లీనర్‌లుగా పనిచేస్తాయి. దీంతో లివర్ శుభ్రంగా మారుతుంది. వ్యర్థాలు బయటకు పోతాయి.
7. వాల్ నట్స్‌లో ఆర్గైనైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది లివర్‌ను శుభ్రం చేసేందుకు సహాయ పడుతుంది. వాల్ నట్స్ లో ఉండే గ్లూటా థియోన్, ఒమెగా 3 ఫ్‌యాటీ యాసిడ్లు లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. లివర్ శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది.