food

ఘుమ ఘుమ‌లాడే చేప‌ల ఫ్రై.. త‌యారు చేయండిలా..!

ఈ రోజు ఏం వండుకుందామండీ… నీకు చికెన్‌ ఇష్టం కదా చికెన్‌ తీసుకు వస్తా.. వామ్మో చికెన్‌ వద్దండి.. అదేంటే చికెన్‌ ఫ్రై అంటూ కలవరిస్తావుగా.. అదే.. కానీ… కరోనా.. మరి కరోనా వస్తుందంని భయంతో వద్దంటున్నా.. సరే మరి. ఇది ఈ మద్య ఆదివారం చాలా చోట్ల వినిపించే మాటలు.. మరి రుచికరమైన, ఆరోగ్యవంతమైన చేపలు తింటే మేలు… అంతేగా..

గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే.. వారంలో క‌నీసం 2 సార్ల‌యినా చేప‌ల‌ను వండుకుని తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే చేప‌ల్లో ఉండే ఔష‌ధ గుణాలు అలాంటివి మ‌రి. అందుకే చాలా మంది చేప‌లను ఎక్కువ‌గా తింటుంటారు. అయితే చేప‌ల‌ను కూర‌గా వండుకుని తిన‌లేని వారు వాటితో ఫ్రై చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌రి చేప‌ల ఫ్రై ఎలా చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

how to make fish fry recipe in telugu

చేప‌ల ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

చేపలు – 1 కిలో, ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు, కారం – 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, మసాలా పొడి – 2 టీ స్పూన్లు, పసుపు – కొద్దిగా, నూనె – త‌గినంత.

చేప‌ల ఫ్రై త‌యారు చేసే విధానం:

ముందుగా చేపల్ని బాగా శుభ్రం చేయాలి. అనంతరం వాటిని మనకు కావల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అనంతరం ఉల్లిపాయని క‌ట్ చేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి బాగా కలియ‌బెట్టాలి. అనంత‌రం అందులో చేప ముక్కలు వేసి ఆ మిశ్రమం అంతా చేప ముక్కలకి బాగా పట్టేలా కల‌పాలి. అనంతరం ఆ ముక్క‌ల‌ను ఒక గంట పాటు అలాగే ఉంచాలి. దీంతో ఆ మిశ్ర‌మం చేప‌ల‌కు బాగా ప‌డుతుంది. త‌రువాత పాన్ తీసుకుని అందులో నూనె పోసి కాగాక చేప ముక్క‌ల‌ను వేసి బాగా ఫ్రై చేయాలి. స‌న్న‌ని మంట‌పై వేయిస్తే చేపలు బాగా ఫ్రై అవుతాయి. ఆ త‌రువాత ఫ్రై చేసిన చేప‌ముక్క‌ల‌పై క‌రివేపాకు, కొత్తిమీర వేసి అలంకరిస్తే చాలు.. ఘుమ ఘుమ లాడే చేప‌ల వేపుడు త‌యారైపోతుంది..!

Admin

Recent Posts