Masala Tea Recipe : టీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఏ కాలమైనా సరే టీ అనేది చాలా మందికి ఇష్టమైన పానీయం. చలికాలంలో అయితే ఈ టీని అధికంగా తాగుతుంటారు. ఉదయాన్నే వేడి వేడి టీ గొంతులో పడితే వచ్చే మజాయే వేరు. అయితే మనం ఇంట్లో తాగే టీకి బయట తాగే టీకి చాలా తేడా ఉంటుంది. బయట బండిపై మసాలా టీ అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. కానీ ఇంట్లో మనం మసాలా టీ పెట్టుకుంటే ఆ రుచి రాదు. ఎందుకు.. అంటే.. అందులో సరైన పదార్థాలను సరైన మోతాదులో కలపకపోవడమే అని చెప్పవచ్చు. అయితే కింద చెప్పిన విధంగా సూచనలు పాటిస్తే.. బయట బండ్లపై లభించే విధంగా మసాలా టీని ఎంతో రుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బయట బండ్లపై వచ్చేలాంటి రుచి రావాలంటే మసాలా టీ కోసం మనం లవంగాలు, యాలకులు, అల్లం ఉపయోగించాలి. ముగ్గురి కోసం టీ పెడితే ఎంత మోతాదులో ఏమేం కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 2 ఇంచుల అల్లం ముక్కను తీసి దంచి పక్కన పెట్టాలి. అల్లాన్ని నేరుగా వేయకూడదు. టేస్ట్ రాదు. ఎల్లప్పుడూ దంచే వేయాలి. దీంతోపాటు 3 యాలకులను కూడా దంచి పక్కన పెట్టాలి. అలాగే 3 లవంగాలను తీసి పక్కన పెట్టాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో 3 చిన్న గ్లాసుల మోతాదులో నీళ్లను పోయాలి. నీళ్లను మీడియం మంటపై బాగా మరిగించాలి. నీరు మరిగాక స్టవ్‌ను సన్నని మంటపై ఉంచాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో దంచిన అల్లం, యాలకులతోపాటు లవంగాలను కూడా వేయాలి. వీటిని బాగా మరిగించాలి. నీరు కలర్ కాస్త మారాక అందులోనే 3 టీస్పూన్ల టీపొడి వేయాలి. 3 టీస్పూన్ల చక్కెర కూడా వేసి బాగా కలపాలి. తరువాత డికాషన్ రెడీ అవుతుంది. అనంతరం అందులో 3 చిన్న గ్లాసుల మోతాదులో పాలను పోయాలి. తరువాత బాగా కలుపుతూ ఉండాలి. టీ మరిగి పొంగు వస్తుంది. దీంతో టీ రెడీ అయినట్లు భావించాలి. అలా టీ పొంగితేనే బాగా టేస్ట్ వస్తుంది. ఇలా మసాలా టీని బయట బండ్లపై లభించేట్లు రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసే టీని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.