ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టించింది. దాని భీభత్సతం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కరోనాకు చెందిన రెండు వేరియెంట్లు ఒకే వ్యక్తికి వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓ విదేశీయురాలికి కోవిడ్ రెండు స్ట్రెయిన్లు సోకగా.. ఇప్పుడు అలాంటిదే ఒక కేసు భారత్‌లో నమోదైంది.
అస్సాంకు చెందిన ఓ వైద్యురాలికి కోవిడ్ కు చెందిన రెండు రకాల స్ట్రెయిన్లు వ్యాప్తి చెందాయి. మే నెలలో ఆమె కోవిడ్ బారిన పడగా ఆమెకు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు ఆల్ఫా, డెల్టా వేరియెంట్‌లు రెండూ సోకినట్లు వైద్యులు తాజాగా నిర్దారించారు. అయితే ఇలా ఒకే వ్యక్తికి రెండు కోవిడ్ స్ట్రెయిన్లు సోకడం భారత్‌లో ఇదే తొలిసారి.
ఈ నెల ఆరంభంలో బెల్జియంకు చెందిన ఓ మహిళకు ఇలాగే భిన్న కోవిడ్ స్ట్రెయిన్లు వ్యాప్తి చెందాయి. ఈ విధంగా ఒకరికే ఒకటికన్నా ఎక్కువ సంఖ్యలో కోవిడ్ స్ట్రెయిన్లు వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్టు డాక్టర్ బి.బొర్కకొటి మాట్లాడుతూ.. అస్సాంకు చెందిన సదరు మహిళ నుంచి తాము 18 శాంపిల్స్ ను సేకరించామని తెలిపారు. రెండో సారి పరీక్షలు నిర్వహించాకే ఆమెకు డబుల్ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్దారించామని తెలిపారు. అయితే డబుల్ ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు వస్తాయి, పరిస్థితి ఎలా ఉంటుంది ? అన్న విషయాలపై అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు.