ఆస్ట్రేలియాలో వ్యాప్తి చెందుతున్న బురులి అల్సర్‌.. శరీర భాగాలను బాక్టీరియా తినేస్తుంది..

ఓ వైపు కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోకముందే ప్రజలను మరో వ్యాధి భయ పెడుతోంది. మనుషుల మాంసం తినే వ్యాధిగా నిపుణులు దాన్ని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా అనే ప్రాంతంలో ఆ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఈ క్రమంలోనే దాన్ని బురులి అల్సర్‌గా నిర్దారించారు. విక్టోరియా చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ బ్రెట్‌ సుటాన్‌ అక్కడి ఎస్సెన్‌డాన్‌, మూనీ పాండ్స్‌, బ్రన్స్‌విక్‌ వెస్ట్‌ ఏరియాల ప్రజలు, ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాధి మైకోబాక్టీరియం అల్సరెన్స్‌ అనే బాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుంది. దోమల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల దోమలు నివాసం ఉండే, పెరిగే ప్రాంతాలను శుభ్రం చేయాలని అక్కడి ఆరోగ్యశాఖ విభాగం అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

flesh eating buruli ulcer spreads in austrlia important points

ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మానికే కాకుండా కొన్ని సార్లు ఎముకలకూ సూక్ష్మ క్రిములు వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో కణజాలం, ఎముకలు దెబ్బతింటాయి. తీవ్రతరం అయితే ఆయా భాగాలను పూర్తిగా తీసేయాల్సి కూడా వస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ముందుగా పురుగు కుట్టినట్లు చిన్న వాపు కనిపిస్తుంది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు. దీంతో అది తీవ్రతరం అయ్యేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు.

ఈ వ్యాధి సోకిన వారిలో సూక్ష్మ క్రిముల ఇంకుబేషన్‌ సమయం సగటున 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది. తరువాత ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతరం అవుతుంది. ఆ పరిస్థితి వస్తే ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన భాగాన్ని తీసేయాల్సి ఉంటుంది. అంతేకానీ చికిత్స అంటూ ఉండదు. కానీ ఆరంభంలోనే గుర్తిస్తే యాంటీ బయోటిక్‌ మందులతో ఈ వ్యాధిని తగ్గించవచ్చు. ఈ క్రమంలో ఈ వ్యాధి తగ్గేందుకు కొన్ని నెలల కోర్సు మందులను వాడాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాధి సోకిన వెంటనే గుర్తిస్తే పెద్దగా ప్రమాదం లేకుండానే బయట పడవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

కాగా సదరు మైకోబాక్టీరియం అల్సరెన్స్‌ అనే బాక్టీరియా 29 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండే వాతావరణంలో జీవిస్తుందని, ఆక్సిజన్‌ తక్కువగా తీసుకుంటుందని, ఏ వయస్సులో ఉన్నవారికైనా ఈ బాక్టీరియా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతాల్లోని 33 దేశాల్లో ఈ వ్యాధి సోకిన వారు ఉన్నట్లు సమాచారం అందింది. దీనిపై సైంటిస్టులు త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

Admin

Recent Posts