కరోనా మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. దేశంలో 50 శాతం మంది పెద్దలు పూర్తి స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వివరాలను వెల్లడించింది.
దేశంలో ఇప్పటి వరకు 127.61 కోట్ల కోవిడ్ టీకాలను వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సందర్బంగా ఆ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. దేశంలోని పెద్దల్లో 50 శాతం మంది పూర్తి స్థాయిలో కోవిడ్ టీకాలను తీసుకున్నారని తెలిపారు. వీరందరూ 2 డోసుల టీకాలను తీసుకున్నట్లు వెల్లడించారు.
గత 24 గంటల వ్యవధిలో 1,04,18,707 టీకాలను ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 1,32,44,514 సెషన్లలో టీకాలను ఇచ్చామని అన్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మరింత చురుగ్గా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు వివరించారు. అందరికీ అధిక సంఖ్యలో కోవిడ్ టీకాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా.. భారత్ అత్యధిక సంఖ్యలో టీకాలను వేయడం అభినందించదగిన విషయమన్నారు. అయితే ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన వివరాలను వెల్లడించలేదు.