Dondakaya Menthikaram : దొండకాయ మెంతికారం.. దొండకాయలు మరియు ప్రత్యేకంగా తయారు చేసిన మెంతికారం వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలు తినని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. దొండకాయలతో తరుచూ చేసే వంటకాల కంటే కింద చెప్పిన విధంగా చేసే దొండకాయ మెంతికారం మరింత రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా, చాలా సులభంగా చేసుకోగలిగే ఈ దొండకాయ మెంతికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ మెంతికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, పొడుగ్గా తరిగిన లేత దొండకాయలు – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 6 నుండి 7, చింతపండు – చిన్న నిమ్మకాయంత.
దొండకాయ మెంతికారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత నువ్వులు, శనగపప్పు, మినపప్పు, మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలను వేయించాలి. దొండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి మరో 3 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ మెంతికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా దీనిని తీసుకోవచ్చు.