Turmeric : భారతీయులు పసుపును ఎంతో పురాతన కాలం నుంచి వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని ఔషధంగా కూడా మనం ఎంతో కాలం నుంచి వాడుతున్నాం. పసుపు మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీంట్లో కర్‌క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మనకు అందుబాటులో ఉండే విటమిన్ సి, ఇ ఆహారాల కన్నా ఎన్నో రెట్ల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా కర్‌క్యుమిన్ పనిచేస్తుంది. కనుకనే పసుపును రోజూ తీసుకోవడం వల్ల వ్యాధులను నయం చేసుకోవచ్చు. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.
ఇక పసుపును మనం అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి కలిపి తాగవచ్చు. లేదా రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో పసుపు కలిపి తాగవచ్చు. ఇలా ఏ రకంగా తాగినా కూడా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పసుపు తీసుకోవడం వల్ల మనం అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. షుగర్‌ను, బీపీని, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పసుపు అమోఘంగా పనిచేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. శరీరంలో ఉండే కఫం తగ్గుతుంది. ఇలా పసుపుతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
అయితే పసుపు ఆరోగ్యకరమైన అయినప్పటికీ దీన్ని అధికంగా తీసుకోరాదు. రోజుకు ఒక గ్రామ్ మోతాదులో మాత్రమే పసుపును తీసుకోవాలి. చిన్నారులకు పావు గ్రామ్ ఇవ్వాలి. అంటే పెద్దలు సుమారుగా 1000 మిల్లీగ్రాములు, చిన్నారులు 250 మిల్లీగ్రాముల మోతాదులో పసుపును తీసుకోవాలి. ఇంతకన్నా మించి పసుపును తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయి.
శరీరంలో పసుపు మోతాదు అధికం అయితే జీర్ణాశయంలో అసౌకర్యం కలుగుతుంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలో ఆగ్జలేట్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కనుక పసుపును అవసరం అయిన మోతాదులోనే తీసుకోవాలి. అధికంగా తీసుకోరాదు.