Barley Water : బార్లీ గింజలు.. వీటిని మనలో చాలా మంది చూసే ఉంటారు. ఇవి తీపి, వగరు రుచులను కలిగి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. బార్లీ గింజలను దంచి నీటిలో వేసుకుని గంజిలా చేసుకుని తాగవచ్చు లేదా వీటిని పిండిలా చేసుకుని నీటిలో కలుపుకుని తాగవచ్చు. బార్లీ గింజలను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. బార్లీ గింజలను ఉపయోగించడ వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
జ్వరాల బారిన పడినప్పుడు బార్లీ గింజలతో చేసిన జావను తప్పకుండా ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి దీనిలో పంచదారను, నిమ్మ రసాన్ని, తేనెను, ఉప్పును కలుపుకుని తాగాలి. బార్లీ గింజలతో చేసిన జావను తాగడం వల్ల గొంతునొప్పి, జలుబు, జ్వరం, దాహం, తాపంతోపాటు నీరసం కూడా తగ్గుతుంది. మూత్రకోశంలో మంటతో బాధపడే వారు బార్లీ గింజల జావను తాగడం వల్ల మంట తగ్గుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు అలాగే శరీరానికి నీరు పట్టిన వారు బార్లీ గింజలతో చేసిన జావను తాగడం వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి.
బార్లీ గింజల జావను తాగడం వల్ల మూత్రం ధారాళంగా వస్తుంది. కనుక అతి మూత్ర వ్యాధి ఉన్న వారు ఈ జావను తాగకూడదు. ఈ వ్యాధి తప్ప ఇతర మేహ వ్యాధులు ఉన్న వారు దీనిని నిరభ్యంతరంగా తాగవచ్చు. బార్లీ గింజల పిండిని నేరుగా తినరాదు. ఉడకబెట్టిన పిండిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. బార్లీ గింజల పిండిని, మినప గుళ్ల పిండిని, గోధుమ పిండిని సమపాళ్లలో తీసుకుని ఉడకబెట్టి ఆ మిశ్రమాన్ని భరించగలిగినంత వేడి ఉన్నప్పుడు గడ్డలపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల గడ్డలు త్వరగా మానుతాయి.
20 గ్రాముల బార్లీ గింజలను దంచి ఆ మిశ్రమాన్ని అర లీటర్ నీటిలోవేసి మరిగించి వడకట్టాలి. ఈ నీటిలో తగినంత పటిక బెల్లాన్ని కలుపుకుని 40 రోజుల పాటుతాగడం వల్ల శరీరంలో అతి వేడి తగ్గడంతోపాటు పురుషులల్లో వచ్చే స్వప్న స్కలనం, శీఘ్రస్కలనం వంటి సమస్యలు తగ్గి వీర్య వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల పురుషులల్లో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
కాలిన గాయాలతో బాధపడే వారు బార్లీ గింజలను కళాయిలో వేసి నల్లగా అయ్యే వరకు వేయించాలి. వీటికి తగినంత నువ్వుల నూనెను కలిపి మెత్తగా నూరాలి. ఈ గంధాన్ని కాలిన గాయాలపై రాస్తూ ఉండడం వల్ల అవి త్వరగా మానుతాయి. ఈ విధంగా బార్లీ గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.