Banana Tree : భారతీయ సాంప్రదాయాలలో అరటి చెట్టుకు ఎంతో ప్రధాన్యత ఉంది. పూర్వకాలంలో ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యంలోనూ అరటి చెట్ల ఆకులను, అరటి పండ్లను ఉపయోగించేవారు. అంతేకాకుండా పూర్వకాలంలో అరటి ఆకుల్లోనే భోజనం చేసేవారు. మన శరీరంలో ఉండే క్రిములను చంపే శక్తి అరటి చెట్టుకు ఉంటుంది. అరటి చెట్టు వల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి చెట్టు తీపి, వగరు రుచులను కలిగి ఉండి దేహాన్ని శుద్ధి చేస్తుంది. రక్త విరేచనాలు, బంక విరేచనాలు, రక్త పిత్తం, రక్త స్రావం, పైత్యం, నోటి వెంట రక్తం పడడం, రక్త వాతం, అతిసారం, మూత్రాశయంలో రాళ్లు, అంతేకాకుండా స్త్రీలలో వచ్చే ఎర్ర బట్ట, తెల్ల బట్ట వంటి అనేక వ్యాధులన్నింటినీ అతి సులువుగా నయం చేసే శక్తి అరటికి ఉంటుంది. గాలిలో ఉండే క్రిములను, విషాన్ని హరించే శక్తి కూడా అరటికి ఉంటుంది. చక్కెరకేళి అరటి పండును గోమూత్రంలో వేసి నలిపి రోజూ ఉదయం తింటూ ఉంటే తీవ్రమైన ఉబ్బసం వ్యాధి కూడా తగ్గుతుంది.
రెండు అరటి పండ్లను 30 గ్రాముల నెయ్యిలో వేసి బాగా నలిపి తింటూ ఉంటే స్త్రీలలో వచ్చే ఎర్రబట్ట సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా 50 గ్రాముల అరటి పువ్వు రసాన్ని, 50 గ్రాముల పెరుగును కలిపి తిన్నా కూడా స్త్రీలలో వచ్చే ఎర్రబట్ట సమస్య తగ్గుతుంది. ఈ అరటిపువ్వు రసాన్ని వాడడం వల్ల జిగట విరేచనాలు కూడా తగ్గుతాయి. అరటి పండు మధ్యలో ఒక గ్రాము మిరియాల పొడిని ఉంచి తినడం వల్ల ఎంతోకాలంగా వేధిస్తున్న దగ్గు సమస్య కూడా తగ్గుతుంది.
అంతేకాకుండా అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల కూడా మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా అరటి చెట్టు మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.