Brown Rice Vs White Rice : మనలో చాలా మంది అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక రకాలు డైటింగ్ పద్దతులను పాటిస్తూ ఉంటారు. అలాగే బరువు తగ్గాలని వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను తీసుకుంటూ ఉంటారు. బ్రౌన్ రైస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గవచ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఇలా అనేక విధాలుగా బ్రౌన్ రైస్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే బరువు తగ్గాలనే కోరికతో బ్రౌన్ రైస్ ను ఒక్కటే తీసుకోవడం మంచిది కాదని బ్రౌన్ రైస్ తో పాటు తరుచుగా వైట్ రైస్ ను కూడా తీసుకోవాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. తరుచూ బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల మనం కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. వైట్ రైస్ లో న్యూట్రియంట్స్ తో పాటు యాంటీ న్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి. యాంటీ న్యూట్రియెంట్స్ మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయి. బ్రౌన్ రైస్ యొక్క పై పొరల్లో పైటిక్ యాసిడ్ ఉంటుంది.
ఇది యాంటీ న్యూట్రియెంట్ గా పని చేస్తుంది. కనుక బ్రౌన్ రైస్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తే అవకాశం ఉంది. అలాగే బ్రౌన్ రైస్ లో వైట్ రైస్ కంటే 80 శాతం ఎక్కువగా ఆర్సెనిక్ అనే మెటల్ ఉంటుంది. ఇది శరీరంలో టాక్సిన్ ల శాతాన్ని పెంచుతుంది. అలాగే బ్రౌన్ రైస్ ను తినడం వల్ల కొందరికి త్వరగా జీర్ణం అవ్వకపోవచ్చు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణ సమస్యలు ఉన్న వారు వీటిని తినకపోవడమే మంచిది. వైట్ రైస్ ను తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యలు తక్కువగా వస్తాయి. వైట్ రైస్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరం జింక్ ను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. శరీరానికి తగినంత జింక్ అందడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. బ్రౌన్ రైస్ మంచిదే అయినప్పటికి బ్రౌన్ రైస్ తో పాటు వైట్ రైస్ ను కూడా తగిన మోతాదులో తీసుకుంటూ ఉండాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.