Cloves : సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అటు మసాలా కూరలతో పాటుగా, మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు వీటిని నార్మల్‌గా కూడా తింటారు. ఎందుకంటే లవంగం వంటల్లో రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. లవంగాల్ని కూరలతో పాటు.. కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా వాడతారు. అయితే ఈ లవంగాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో చూద్దాం.
ఈ లవంగాల వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. లవంగాల్ని పొడిగా చేసి.. దెబ్బతిన్న దంతం దగ్గర, పాడైన చిగుళ్ల దగ్గరా పెట్టుకుంటే.. మెల్లమెల్లగా అది మందులా పనిచేసి.. నొప్పిని తగ్గించేస్తుంది. నోరు బాగా దుర్వాసన వస్తుంటే రెండు, మూడు లవంగాలను నోట్లో వేసుకుని నమిలితే నోటి దుర్వాసన వెంటనే తగ్గిపోతుంది. నోట్లో ఉండే బాక్టీరియా, క్రిములు నశిస్తాయి.
కొందరికి దూర ప్రయాణాలు చేయడం పడదు. ప్రయాణాల్లో మధ్యలోనే వాంతులు చేసుకుంటుంటారు. అలాంటి వారి సమస్యను కూడా లవంగాలతో చెక్ పెట్టొచ్చు. ప్రయాణానికి ముందు ఓ రెండు లవంగాలు తీసుకుంటే సరి. తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతోపాటుగా.. వికారం లాంటివి పోతాయి. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతుంది.
కడుపులో బాగా వికారంగా అనిపించినా, తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా.. రెండు, మూడు లవంగాలను నోట్లో వేసుకుని బాగా నమిలి ఆ రసాన్ని మింగితే ఫలితం ఉంటుంది. రోజుకు నాలుగైదు లవంగాలను నోట్లో వేసుకుని తింటూ ఉంటే జలుబు, దగ్గు వంటివి వెంటనే తగ్గిపోతాయి. డయాబెటిస్ ఉన్న వారు నిత్యం మూడు పూటలా ఒక లవంగాన్ని తింటుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. లవంగాలను తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మితంగా కాకుండా.. అదే పనిగా వీటిని తింటే ఇబ్బందులు తప్పవు. ఎక్కువగా తింటే నోరు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. రోజుకు నాలుగైదు కంటే మించకుండా తీసుకోవాలి. పిల్లలకు వీలైనంత తక్కువగా ఇస్తే మంచిది.