Cold In Children : సాధారణంగా చాలా మంది శీతాకాలాన్ని ఇష్టపడతారు. విసుగెత్తించిన వాతావరణాలకు ఆటవిడుపుగా శీతాకాలం ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. కానీ ఈ శీతాకాలంలో వచ్చే చలిగాలి శరీరాన్ని వణికించడమే కాక చర్మం పై చలిగాలి ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ చలిగాలులు శిశువుల మీద చిన్న పిల్లల మీద వృద్ధుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి సమయంలో చిన్న పిల్లలను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. శీతాకాలంలో చలిగాలి ప్రభావానికి పిల్లలు గురి కాకుండా ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం వచ్చిందంటే పిల్లలు మరింత వెచ్చదనాన్ని కోరుకుంటారు.
ఈ కాలంలో అనేక రకాల రుగ్మతలు వచ్చిపడతాయి. చాలా మంది పిల్లలు దగ్గు, జలుబుతో సతమవుతూ ఉంటారు. చలిగాలుల తీవ్రత పెరిగినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఆరోగ్యపరంగా చలికాలం పిల్లలను బాగా కుంగదీస్తుంది. దగ్గు, జలుబు అనే శ్వాసకోస సంబంధిత సమస్యలు గాలి ద్వారా అలాగే పిల్లలు రోజూ వాడే వస్తువుల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. చలికాలంలో పిల్లలు వాడే వస్తువుల మీద బ్యాక్టీరియా జీవించే కాలం మరింత ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కూడా పిల్లల్లో దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు దగ్గుతుంటే వారు ఎలా దగ్గుతున్నారు ఎందుకు దగ్గుతున్నారో తెలుసుకోవాలి. తడి దగ్గు వచ్చిందా లేదా పొడి దగ్గు వచ్చిందా గుర్తించాలి.
సొంత వైద్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి. చల్లగాలికి పిల్లలను ఎక్కువగా తిప్పకూడదు. బయటికి వెళ్లాల్సి వస్తే తగిన వారిని వీలైనంత వెచ్చగా ఉంచాలి. ఇంట్లో ఉన్నప్పటికి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి చెవుల్లోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి. అలాగే చలికాలంలో పిల్లలను ఎక్కువగా నీటిలో ఆడనివ్వకూడదు. దుమ్ము, దూళి కూడా వారి దరి చేరకుండా చూసుకోవాలి. అలాగే పిల్లలకు చల్లటి పదార్థాలను, తీపి పదార్థాలను ఆహారంగా ఇవ్వకూడదు. సమూహం ఎక్కువగా ప్రదేశాలకు ఈ కాలంలో పిల్లలను తీసుకెళ్లకపోవడమే మంచిది. దగ్గుతో జలుబుతో బాధపడే పిల్లలకు సరైన జాగ్రత్తలు తీసుకోవడమే అన్నింటి కంటే ప్రధానమైనది.