Cumin Water : మనం వంటింట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి జీలకర్ర. దీనిని పూర్వకాలంలో మమ్మీలను తయారు చేయడంలో ఉపయోగించేవారు. భారత దేశంలో దీనిని వేయకుండా వంటను తయారు చేయనే చేయరు. అతి సాధారణమైన వంటకాలలో కూడా మనం జీలకర్రను వేస్తూనే ఉంటాం. జీలకర్రను వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ తోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి లు కూడా అధికంగా ఉంటాయి. తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు జీలకర్రను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. షుగర్ వ్యాధిని నియంత్రించే గుణం కూడా జీలకర్రకు ఉంటుంది. జీలకర్ర నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. జీలకర్ర నీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభమే.
నీటిని ముందుగా పది నిమిషాల పాటు మరిగించి ఆ తరువాత అందులో జీలకర్రను వేసి మరో పది నిమిషాలు మరిగించి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టగా వచ్చే నీరు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి. జీలకర్రను దోరగా వేయించి దానికి సమపాళ్లల్లో వేయించని జీలకర్రను కలపాలి. దీనికి పంచదారను, నెయ్యిని కలిపి కుంకుడు గింజంత పరిమాణంలో మాత్రలుగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా రెండు మాత్రలను వేసుకుంటే మూత్రంలో మంట, వేడి వంటి వాటితోపాటు మూత్రసంబంధమైన సమస్యలన్నీ తగ్గుతాయి.
జీలకర్ర నీటిని తాగడం వల్ల రక్త హీనత నుంచి బయట పడవచ్చు. అంతేకాకుండా జీలకర్రను వంటల్లో ఉపయోగించినా లేదా జీలకర్ర నీటిని తాగినా పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీటిని తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. జీర్ణ క్రియను మెరుగురచడంలో జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది. గొంతునొప్పిని తగ్గించడంలో కూడా జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. గోరు వెచ్చగా ఉన్న జీలకర్ర నీటిని తాగడం వల్ల గొంతునొప్పితోపాటు గొంతులో గరగర కూడా తగ్గుతుంది. ఈ నీటిని తాగడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.
ఈ నీటిని తాగడం వల్ల దంతాల సమస్యలు, కీళ్ల నొప్పులు, వాపులు, శ్వాస సంబంధమైన సమస్యలు కూడా తగ్గుతాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల బాలింతలల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఒక టీ స్పూన్ జీలకర్రను ఆహారంలో భాగంగా లేదా పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. ఈ విధంగా జీలకర్రను, జీలకర్ర నీటిని ఉపయోగించి మందులను వాడే పని లేకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.