Kidneys : మన శరీరంలో ఉండే మలినాలను, విష పదార్థాలను మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ మన శరీరానికి రక్షణను కలిగిస్తూ ఉంటాయి. గంటకు రెండు సార్లు మన శరీరంలో ఉండే రక్తాన్ని మూత్రపిండాలు వడకట్టి మలినాలను తొలగిస్తూ ఉంటాయి. మూత్రపిండాల యొక్క గొప్పతనం అవి పాడైతే కానీ మనకు తెలియదు. ఎందుకంటే మనలో చాలా మంది మూత్రపిండాల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో వాటి పనితీరు క్రమంగా తగ్గి కొంత కాలానికి పాడైపోతాయి. మూత్రపిండాల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న తరువాత బాధపడడం కంటే మనం ముందుగానే వాటిని సంరక్షించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలు మన శరీరంలో ఎన్ని విధులను నిర్వర్తిస్తాయో మనం ముందుగానే తెలుసుకోగలిగితే మూత్రపిండాల ఆరోగ్యంపై మనం శ్రద్ద పెట్టగలుగుతాము.
మన శరీరంలో ఎక్కువగా నీటిని అలాగే ఈ నీటితో పాటు వ్యర్థాలను కూడా మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. దీంతో శరీరంలో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో ఆమ్లతత్వం పెరగకుండా క్షారనిష్పత్తిని అదుపులో ఉంచడంలో కూడా మూత్రపిండాలు మనకు సహాయపడతాయి. అదే విధంగా శరీరంలో నీటి స్థాయిలను నియంత్రించడంలో కూడా మూత్రపిండాలు దోహదపడతాయి. శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు ఉన్న నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించకుండా నీటిని సమతుల్యం చేస్తాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారిలో బీపీ ఎక్కువగా ఉంటుంది.
బీపీని అదుపులో ఉంచే హార్మోన్లను మూత్రపిండాలు విడుదల చేస్తాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల ఈ హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కాక బీపీ అదుపు తప్పుతుంది. కనుక బీపీ అదుపులో ఉండాలంటే ముందుగా మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. అదే విధంగా విటమిన్ డి ని మన శరీరం గ్రహించేలా చేయడంలో కూడా మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇక మన శరీరంలో రక్తం ఎక్కువగా తయారవ్వాలన్నా కూడా మూత్రపిండాలు అవసరం. మూత్రపిండాలు ఎరిత్రోపొయోటిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ ఎక్కువగా ఉంటేనే ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నప్పుడు ఈ హార్మోన్ ఎక్కువగా విడుదల అవ్వదు. దీంతో శరీరంలో రక్తహీనత సమస్య తలెత్తుతుంది. కనుక మనం మూత్రపిండాల ఆరోగ్యాన్ని మన కాపాడుకోవాలి. అలాగే మనం వాడే మందుల్లో ఉండే విష పదార్థాలను మనం తీసుకునే ఆహారంలో ఉండే విష పదార్థాలను, వ్యర్థాలను, ఎరువులను, పురుగు మందులను విచ్చిన్నం చేసి 80 శాతం వరకు మూత్రపిండాలే బయటకు పంపిస్తాయి. ఒకవేళ మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే మన శరీరంలో, రక్తంలో ఈ విష పదార్థాలు పేరుకుపోయి మనం అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. అదే విధంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా మూత్రపిండాలు మనకు సహాయపడతాయి.
శరీరంలో మినరల్స్ ను ఎక్కువ తక్కువా కాకుండా నియంత్రించడంలో కూడా మూత్రపిండాలు దోహదపడతాయి. ఈ విధంగా మూత్రపిండాలు మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటేనే మన శరీర ఆరోగ్యం బాగుంటుంది. కనుక మనం మూత్రపిండాల ఆరోగ్యంపై కూడా తగినంత శ్రద్ద చూపించాలని వారు చెబుతున్నారు. మూత్రపిండాలు జీవితకాలం ఆరోగ్యంగా పని చేయాలంటే బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవాలి. వంటల్లో ఉప్పును తగ్గించాలి. నిల్వ పచ్చళ్లను అస్సలు తీసుకోకూడదు. నీటిని ఎక్కువగా తాగాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయని వాటి విధులను సక్రమంగా నిర్వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు.