Ginger Juice : ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా వర్షాకాలం మొదలైంది. వాతావరణం చల్లగానే ఉంటోంది. దీంతో క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు కూడా ఎక్కువయ్యాయి. అలాగే మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా కాస్త పరిశుభ్రతను లోపిస్తాయి. కనుక ఈ సీజన్‌లో మనకు ఎటు చూసినా రోగాల బెడద ఎక్కువగానే ఉంటుంది. వైరస్, బాక్టీరియా, ఫంగస్ వంటివి ఏ క్షణంలో ఏ మూల నుంచి మనపై దాడి చేస్తాయో మనకు తెలియదు. కనుక ఈ సీజన్‌లో చాలా అప్రమత్తంగా ఉండాలి. రోగం వచ్చాక బాధపడడం కన్నా రాక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో అనేక రోగాలకు ముందుగానే చెక్ పెట్టవచ్చు. ఇక రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మనకు అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.
రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. అల్లంలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కనుక వాటి వల్ల వచ్చే వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది. మనకు ఈ సీజన్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక అల్లం రసం సేవిస్తే అలా జరగకుండా చూసుకోవచ్చు. పైగా అల్లం రసాన్ని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణంతోపాటు వికారం, వాంతులు వంటి రోగాల నుంచి కూడా సురక్షితంగా ఉండవచ్చు.
ఈ సీజన్‌లో మన శరీరంపై దాడి చేసేందుకు అనేక రకాల సూక్ష్మజీవులు సిద్ధంగా ఉంటాయి. వాటన్నింటి నుంచి తప్పించేందుకు మనకు అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల అల్లంను ఈ సీజన్‌లో తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. బాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే రోగాలు రాకుండా ముందుగానే నివారించవచ్చు. అయితే అల్లం రసంలో కాస్త తేనె కలిపి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.