Masoor Dal Soup : ఈ వర్షాకాలంలో సర్వ సాధారణంగా అందరూ ఎదురుకొనే సమస్య జ్వరం, జలుబు, దగ్గు. ఇక సీజన్ మారినప్పుడల్లా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కొంతమంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడతారు. ఈ సీజన్‌లో శరీరంలో రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు దగ్గు, జలుబు, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులతో సతమతమవుతూ ఉంటాము. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి పెరుగుతుందో ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు. ఇలా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు ఈ సూప్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఇప్పుడు వ్యాధినిరోధక శక్తిని పెంచే సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ లో అర కప్పు ఎర్ర కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి నీటిని పోసి ఐదు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత క్యారెట్, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నానబెట్టిన కందిపప్పులో క్యారెట్, టమాటా ముక్కలు, పావు టీస్పూన్ పసుపు, రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని పాన్ లో వేసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన ఈ పదార్థాలను చల్లబడిన తరువాత నీటితో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోని దానిలో ఒక కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ మిరియాల పొడి వేసి పది నిమిషాల పాటు మీడియం హీట్ లో మరిగిస్తే వేడి వేడిగా ఎర్ర కందిపప్పు సూప్ రెడీ అవుతుంది. ఈ ఎర్ర కందిపప్పు సూప్ ను వారంలో రెండు లేదా మూడుసార్లు ఉదయం సమయంలో తీసుకోవాలి. దీంతో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా మారి ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. దీని వల్ల అనేక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.