Summer Health Tips : వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 సూచనలు పాటించాల్సిందే..!

Summer Health Tips : అన్ని సీజన్ల మాదిరిగానే మనకు వేసవి కాలంలోనూ పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లోనూ చాలా మందికి దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. అలాగే వేసవిలో వేడి అధికంగా ఉంటుంది కనుక మూత్రంలో మంట, విరేచనాలు వంటి సమస్యలు కూడా చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ క్రమంలోనే వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఎండ దెబ్బ, వేసవి తాపం నుంచి బయట పడడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

follow these Summer Health Tips  to be healthy in summer season
Summer Health Tips

1. వేసవిలో మన శరీరంలో ద్రవాలు త్వరగా ఖర్చవుతుంటాయి. వేడి ఎక్కువగా ఉంటుంది కనుక చెమట అధికంగా పడుతుంది. దీంతో శరీరంలోని నీరు త్వరగా అయిపోతుంది. కనుక మనకు ఈ సీజన్‌లో సహజంగానే దాహం అధికంగా వేస్తుంది. అయితే కొందరు నీళ్లను సరిగ్గా తాగరు. అలా తాగకపోతే డీహైడ్రేషన్‌ బారిన పడతారు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక దాహం అయినప్పుడల్లా ఈ సీజన్‌లో ఎంత నీటిని అవసరం అయితే అంత నీటిని తాగాలి. దీని వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు.

2. వేసవిలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ ఎండదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలే పోవచ్చు. కనుక బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లేముందు ఒక గ్లాస్‌ చల్లని మజ్జిగ లేదా కొబ్బరినీళ్లు తాగాలి. వీలుంటే పుచ్చకాయ, తర్బూజా, కీరదోస వంటివి తినాలి. ఇవి ఎండ దెబ్బ బారిన పడకుండా రక్షిస్తాయి. కనుక ఎండలోకి వెళ్లేవారు తప్పకుండా వీటిని తీసుకునే బయటకు వెళ్లాలి. దీని వల్ల వేసవి తాపం నుంచి బయట పడవచ్చు.

3. ఈ సీజన్‌లో చాలా సులభంగా జీర్ణం అయ్యే తేలికపాటి ఆహారాలను తీసుకోవాలి. మాంసం, కారం, మసాలాలు ఉండే ఆహారాలను అధికంగా తీసుకుంటే అజీర్తి వస్తుంది. దీంతో విరేచనాలు అవుతాయి. కనుక ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వేసవిలో ఆరోగ్యంగా ఉంటారు.

4. వేసవిలో ఎండలో తిరిగితే చర్మం త్వరగా ఎర్రగా మారి కందిపోయినట్లు అవుతుంది. ఎర్రని మచ్చలు వస్తాయి. అలాగే సూర్యకిరణాలు నేరుగా పడడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. కనుక ఎండలో తిరిగే వారు చర్మాన్ని సంరక్షించుకోవాలి. అందుకు గాను బయటకు వెళ్లినప్పుడు టోపీలు ధరించడం, ముఖానికి ఖర్చీఫ్‌ లేదా స్కార్ఫ్‌లు చుట్టుకోవడం చేయాలి. దీని వల్ల చర్మంపై సూర్య కిరణాల ప్రభావం ఉండదు. అలాగే చేతులు, కాళ్లను కప్పి ఉంచేలా వదులైన కాటన్‌ వస్త్రాలను ధరించాలి. దీని వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక స్థోమత ఉన్నవారు సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌ (ఎస్‌పీఎఫ్‌) 35 శాతం ఆపైన ఉండే సన్‌ ప్రొటెక్షన్‌ క్రీమ్‌లను వాడాలి. ఎండలోకి వెళ్లే ముందే వీటిని చర్మంపై రాసుకుంటే ఆ తరువాత ఎండ తగిలినా చర్మానికి ఏమీ కాదు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

5. వేసవిలో మనం ధరించే దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. బిగుతైన దుస్తులు ధరిస్తే లోపలి అవయవాలకు గాలి సరిగ్గా ఆడదు. దీంతో అక్కడ చెమట ఎక్కువగా వచ్చి తేమగా ఉంటుంది. దీని వల్ల బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కనుక వదులైన దుస్తులనే ఈ సీజన్‌లో ధరించాలి. దీంతో చర్మ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

ఇలా పలు జాగ్రత్తలను పాటించడం వల్ల వేసవిలో అన్ని విధాలుగా మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.

Admin

Recent Posts