Weight Gain : మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏవిధంగా అయితే వస్తాయో అదే విధంగా బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా ఉండడం వల్ల అనేక రకాల రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తక్కువగా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి. సరైన పోషకాహారం లేకపోవడం, ఆహారాన్ని తీసుకున్నా కూడా శరీరానికి పట్టకపోవడం, థైరాయిడ్ ఎక్కువగా ఉండడం వంటి అనేక కారణాల వల్ల చాలా మంది బరువు తక్కువగా ఉంటారు.
అలాగే కొందరు జన్యుపరంగా కూడా బరువు తక్కువగా, సన్నగా ఉంటారు. బరువు పెరగడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి విఫలమైన వారు చాలా మందే ఉంటారు. చాలా సులభంగా, ఆరోగ్యంగా బరువు ఎలా పెరగాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువును తగ్గించుకోవడం ఎంత కష్టమో, సన్నగా ఉన్న వారు బరువు పెరగడం కూడా అంతే కష్టం. చాలా మంది బరువు పెరగడానికి చిరుతిళ్లను తింటూ ఉంటారు. దీని వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూనే మనం బరువు పెరగాలి. మనకు ప్రతిరోజూ 2000 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. బరువు పెరగాలనుకునే వారు ఇంత కంటే ఎక్కువ క్యాలరీలను అందించే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
మన ఇంట్లోనే బరువును పెంచే ప్రోటీన్ స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు పెరగవచ్చు. ఈ స్మూతీ తయారీ కోసం మనం రెండు అరటి పండ్లను, ఒక గ్లాస్ పాలను, ఒక టీ స్పూన్ ఎండు ద్రాక్షను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక జార్ లో పాలను, అరటి పండ్లను, ఎండు ద్రాక్షను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి శక్తి లభించడంతోపాటు బరువు కూడా పెరగవచ్చు. ఈ విధంగా తయారు చేసిన స్మూతీని తాగలేని వారు విడివిడిగా ఈ పదార్థాలన్నింటినీ తీసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న స్మూతీని రోజుకు రెండు గ్లాసుల చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. ఈ స్మూతీని తాగడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. సన్నగా ఉన్నవారు ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఈ స్మూతీ చక్కగా పనిచేస్తుంది. ఈ స్మూతీని తాగడం వల్ల బరువు పెరగడంతోపాటు స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. రోజూ ఈ స్మూతీని తాగడంతోపాటు అర కప్పు నల్ల శనగలను, అర కప్పు అలసంద గింజలను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు తీసుకోవాలి. ఇలా నానబెట్టిన శనగలను, అలసంద గింజలను రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల మన శరీరానికి తగినన్ని ప్రోటీన్స్ లభించి మనం సహజసిద్ధంగా బరువు పెరగవచ్చు.
ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటూనే బరువు పెరగడానికి మనం కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. బరువు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎముకల సంబంధిత సమస్యలు, సంతాన లేమి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బరువు తక్కువగా ఉండడాన్ని సాధారణ సమస్యలా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. బరువు తక్కువగా ఉండడం కూడా అనారోగ్య సమస్యతో సమానమే.
బరువు తక్కువగా ఉన్నవారు వారు తీసుకునే ఆహారం పరిమాణాన్ని పెంచాలి. కొద్ది కొద్దిగా ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇలా తినడం వల్ల తిన్న ఆహారం శరీరానికి పడుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు క్యాలరీలు ఎక్కువగా ఉండే పానీయాలను తీసుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ ను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వల్ల కాళ్లు, చేతులు సన్నగా ఉండి పొట్ట, తొడలు వంటి భాగాలు లావుగా తయారవుతాయి. బరువు తక్కువగా ఉన్నప్పటికీ వ్యాయామాలు చేస్తూ ఉండాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మనం ప్రతిరోజూ ఖర్చు చేసే క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకోవాలి. పైన తెలిపిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా త్వరగా బరువు పెరుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.