ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కిడ్నీ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది కిడ్నీలు చెడిపోవడం వల్ల చనిపోతున్నారు. అయితే కిడ్నీ వ్యాధులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయినప్పటికీ పలు ఆహారాలను తరచూ తీసుకోవడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
* మనకు మార్కెట్‌లో రక రకాల క్యాప్సికం అందుబాటులో ఉంటుంది. అందులో ఎరుపు రంగు క్యాప్సికం కూడా ఒకటి. దీన్ని తినడం వల్ల కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ క్యాప్సికంలో లైకోపీన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఎ, సి, బి6, ఫైబర్, ఫోలిక్ యాసిడ్‌లు కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి. ఎరుపు రంగు క్యాప్సికంను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
* కిడ్నీ సమస్యలు ఉన్నవారు, లేని వారు ఎవరైనా సరే.. క్యాబేజీని తప్పనిసరిగా తినాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను సురక్షితంగా ఉంచుతాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి. డయాలసిస్ పేషెంట్లు క్యాబేజీని తినడం మేలు. ఇందులో ఉండే విటమిన్ కె, సి, ఫైబర్‌ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
* కాలిఫ్లవర్‌లో విటమిన్ సి, ఫైబర్, ఫొలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను సంరక్షిస్తాయి. డయాలసిస్ పేషెంట్లు కాలిఫ్లవర్‌ను తింటే మంచిది.
* ఉల్లిపాయలు, వెల్లుల్లిలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ కిడ్నీలను సురక్షితంగా ఉంచుతాయి. డయాలసిస్ రోగులు ఈ రెండు ఆహారాలను నిత్యం తీసుకుంటే మంచిది.
* క్రాన్‌బెర్రీలు, స్ట్రాబెర్రీలను ఎక్కువగా తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను సంరక్షిస్తాయి.