Gongura Puvvulu : మనం అనేక రకాల ఆకు కూరలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో గోంగూర కూడా ఒకటి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. గోంగూర పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. గోంగూరను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కేవలం గోంగూర మాత్రమే కాకుండా గోంగూర పువ్వులు కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ పువ్వులు కూడా పోషకాలను కలిగి ఉంటాయి. వీటితో కూడా పచ్చడిని, పప్పును తయారు చేస్తూ ఉంటారు. గోంగూర పువ్వులతో కూడా మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. గోంగూర పువ్వుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర లాగే గోంగూర పువ్వులు కూడా పుల్లగా ఉంటాయి. ఈ పువ్వులతో టీ ని కూడా తయారు చేసుకోవచ్చు. గోంగూర పువ్వులతో చేసిన టీ ని తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. క్యాన్సర్, బీపీ, నరాల సంబంధిత రోగాల వంటి వాటిని దరిచేరకుండా చేయడంలో ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గోంగూర పువ్వులల్లో కాల్షియం, ఐరన్ లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. గోంటూర పువ్వులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను నివారించి రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో కూడా ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టీ యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.
జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు గోంగూర పువ్వుల టీ ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ టీ ని తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. బరువు తగ్గడంలో కూడా గొంగూర పువ్వుల టీ ఎంతగానో సహాయపడుతుంది. ఈ టీ ని తాగడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలైన కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. గోంగూర పువ్వులనే కాకుండా గోంగూర ఆకులను కూడా మనం ఔషధంగా ఉపయోగించవచ్చు.
గడ్డలను, వ్రణాలను తగ్గించడంలో గోంగూర ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. గోంగూర ఆకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి వాటిని గడ్డలపై, వ్రణాలపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల గడ్డలు, వ్రణాలు త్వరగా తగ్గుతాయి. రేచీకటితో బాధపడే వారు తరచూ భోజనంలో గోంగూరను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా గోంగూరను తింటూనే గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి వడకట్టి ఆ రసానికి అర కప్పు పాలను కలిపి రోజుకు రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల రేచీకటి త్వరగా నయం అవుతుంది.
బోదకాలు వాపుతో బాధపడే వారు గోంగూరను, వేపాకును దంచి ఆ మిశ్రమాన్ని వాపులపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల బోదకాలు వాపు తగ్గుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారు ఏదో ఒక రకంగా గోంగూరను తినడం వల్ల చక్కని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా గోంగూరను, గోంగూర పువ్వులను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.