Eggs : ఉద‌యాన్నే కోడిగుడ్ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

Eggs : మ‌నం ఆహారంలో భాగంగా కోడిగుడ్ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వైద్యులు కూడా ప్ర‌తి రోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డును తిన‌మ‌ని సూచిస్తూ ఉంటారు. గుడ్డును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో బ‌లం చేకూరుతుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. ప్రోటీన్స్ ను అధికంగా క‌లిగిన ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. కండ‌పుష్టికి, కండ‌ర నిర్మాణానికి ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కోడిగుడ్ల‌ల్లో 9 ర‌కాల ఆమైనో యాసిడ్లు, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ డి, విట‌మిన్ ఇ ల‌తోపాటు అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి.

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల త‌క్కువ ఖ‌ర్చులో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోషకాల‌న్నీ ల‌భిస్తాయి. అంతేకాకుండా వీటిని మ‌నం ఎప్పుడుప‌డితే అప్పుడు తిన‌వ‌చ్చు. కోడిగుడ్ల‌ల్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంద‌ని వీటిని చాలా మంది తిన‌డం మానేస్తారు. కానీ వీటిని మితంగా తిన‌డం వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌ద‌ని వీటిని ఆహారంలో భాగంగా త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్డ‌లో విట‌మిన్ డి అధికంగా ఉంటుంది. ప్ర‌స్తుత కాలంలో విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. విట‌మిన్ డి లోపం వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డే వారు కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డ‌మే కాకుండా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటారు.

eat Eggs in breakfast for wonderful benefits
Eggs

శారీర‌క శ్ర‌మ అధికంగా చేసే వారు గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. కోడిగుడ్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు, నాడీ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఉద‌యం పూట కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఇవి జీర్ణ‌మ‌వ్వ‌టానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. క‌నుక ఆక‌లి త్వ‌ర‌గా అవ్వ‌దు. దీంతో మ‌నం త‌క్కువ ఆహారాన్ని తీసుకుంటాము. త‌ద్వారా బ‌రువు త‌గ్గ‌డంలో కూడా ఇవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

బ‌రువు తగ్గాల‌నుకునే వారు ఉద‌యం పూట గుడ్డును తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జుట్టును, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా కోడిగుడ్లు మ‌న‌కు దోహద‌ప‌డ‌తాయి.ఇన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి క‌నుక కోడిగుడ్ల‌ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts