Health Tips : ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నది గుండె జబ్బులతోనే కావడం గమనించదగిన విషయం. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే గుండె ఆరోగ్యం విషయంలో రక్త నాళాలు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలు.. గుండె సురక్షితంగా ఉంటుంది.
సాధారణంగా చాలా మందికి రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల గుండె జబ్బులు వస్తుంటాయి. కానీ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే.. గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే రక్త నాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా అవి ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారాల్లో మార్పులు చేసుకోవాలి. పలు రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
1. బాదంపప్పును రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నిత్యం గుప్పెడు బాదంపప్పును తినడం వల్ల రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బాదంపప్పులో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే విటమిన్ ఇ, ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి. కనుక బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
2. బాదంపప్పుల్లాగే వాల్ నట్స్ కూడా పనిచేస్తాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
3. చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తినాలి. చేపల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
4. ఆలివ్ ఆయిల్‌లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో దోహదపడతాయి. కనుక రోజూ ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవాలి.
5. రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూసుకోవచ్చు.